Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Wednesday, May 6, 2026

నమస్తే తెలంగాణ# ద్రోహపు డిక్లరేషన్#వనపట్ల సుబ్బయ్య#9492765358#jaitelangana

నమస్తే తెలంగాణ

 ద్రోహపు డిక్లరేషన్

తొలి వేకువ తలుపులు తెరుచుకోకముందే

వేప పూతలా రాలిపోతున్నారు

భూమిలో చినుకులా ఇంకిపోయి

విత్తనమై సాళ్లువారుతున్నారు

లౌక్యం తెలియక 

రాజకీయ మోసాల జిహ్వలకు

బలైపోతున్నారు

అంగరంగ వైభవంగా

పెళ్లి కొడుకు బరాత్ లా 

రైతు డిక్లరేషన్లు ప్రకటిస్తారు

ధరలు ముడుచుకొన్నాక

ధాన్యానికి దిక్కులేని దారిద్ర్యాలు

పాలకుల విధానాలకు ప్రమోషన్లు

రాళ్లుగా పుట్టుంటే

దేవుడుగా పూజింపబడుదురేమో

నాగళ్లుగా పుట్టి

నిషాన్ లేక పుచ్చిపోతున్నారు

అలలకు 

సముద్రం చేతులెత్తేసే దౌర్భాగ్యపు చరిత్ర

అన్ని రుతువులకు మోసపోతున్నారు.

అన్ని పంటలకు వంచించబడుతున్నారు.

దేశంకోసం నిలబడి

దేహాన్ని విడిచి తప్పుకుంటున్నారు.

మైకుల ముందు కన్నీళ్లను కార్చటమే గానీ

సమగ్ర శాశ్వతాలకు ప్రాతిపదికేది?

దేవాలయాలలోని దైవాలు కాదు

నల్లరేగడి భూములలో

నడిపించే దేవుళ్లు

చెరువులో

చంద్రుడి ప్రతిబింబంలా కర్షకుడు

అన్ని దానాల్లో 

అన్నదానం మిన్నన్నారు

అన్నాన్ని సృష్టించిన అన్నదాతలు

అన్యాయంగా ఒరిగిపోతున్నారు

శ్రమ స్వేదం మట్టిలో

కలిసిపోతున్నది

అనంత సంగ్రామం చేసి

వెన్నెలను తెచ్చుకోవటం

చీకట్లో మగ్గిపోవటానికేనా?

అసమాన త్యాగాలు

కండ్లముందే శ్రామిక

ఫలాలు వట్టిపోతున్నాయి

వరంగల్ డిక్లరేషన్లు

మరో ద్రోహపు చరిత్ర

వనపట్ల సుబ్బయ్య -  94927 65358


No comments:

Post a Comment