దేశానికి ప్రత్యామ్నాయం కేసీఆరే
- దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలన్న డిమాండ్
- వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అల్పులు, సంకుచిత ధోరణి ఉన్నవాళ్లు పాలిస్తుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తున్నదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజకీయ కాంక్ష కాదని .. ఈనాటి అనివార్య పరిస్థితుల్లో దేశానికి ముఖ్య అవసరమని చెప్పారు. 90వ దశకంలో తెలుగు నేల నుండి జాతీయస్థాయి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది తెలుగు చైతన్యమే అని, మాకు ఎదురులేదన్న కాంగ్రెస్‌ను అతలాకుతలం చేసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌లు ఏర్పడి ఈ దేశ ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయన్నారు.
ప్రాంతీయ పార్టీల కలయికే ఈ దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అందించగలదని చరిత్రలో రుజువయిందన్నారు. నేడు ప్రైవేటు, బడా కార్పొరేట్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతున్నదని దుయ్యబట్టారు. దేశంలోని 60 శాతం ప్రజలు ఆధారపడిన రైతాంగం జీవితాలను పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే దార్శనిక పాలకులు రావాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మోదీ కంటే ముందే కేసీఆర్ 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అ తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచారని గుర్తుచేశారు.
మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, 14 ఏండ్లు భారత రాజ్యాంగ పరిధిలో ఒక సుదీర్ఘ మహా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించి దేశానికి రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా నిలిపారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అదే మోదీ 2002 నుండి ముఖ్యమంత్రిగా, ఎనిమిదేండ్లు ప్రధానిగా ఉన్నా.. కేసీఆర్ కన్నా జూనియర్ అని చెప్పారు. పలు మాజీ దేశాధినేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో కేసీఆర్ ప్రశంసలు అందుకొన్నారని గుర్తుచేశారు. అమితమైన పరిజ్ఞానం, లోతైన పరిశోధన, ఆంగ్ల, తెలుగు, ఉర్దూ (హిందీ) భాషల్లో అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలిస్తూ, ఆలోచింపచేస్తున్నాయని పేర్కొన్నారు. పరాయి పెత్తనాన్ని మోసే బానిసలు ఈ గొప్పతనం గమనించలేరన్నారు.
దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
భారత దేశ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం. ఆయన పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా మారింది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, కృషితోనే ఇది సాధ్యమైంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఇతర ముఖ్యమంత్రులు తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ కుల, మత రాజకీయాలు చేయడమే తప్ప దేశాభివృద్ధి గురించి ఆలోచించిందే లేదు. ఆయనను ఢీకొట్టే శక్తి, సామర్థ్యాలు కేసీఆర్‌కి మాత్రమే ఉన్నాయి. అందుకే ఆయన తప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకొంటున్నా.
– డాక్టర్ అసద్ ఖాన్, కువైట్-స్వీడిష్ కంపెనీ జీఎం
నడిపించేవాడే నాయకుడు.. ఆయనే కేసీఆర్
నాయకుడంటే ముందు ఉండి నడిపించేవాడే. అలాంటి నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే. ఏ విషయాన్నైనా ప్రజలకు, అధికారులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పడంలో సిద్ధహస్తులైన సీఎం కేసీఆర్.. అధికారుల పనితీరులో లోపం వచ్చినప్పుడు మందలించడంలో ఎలాంటి మొహమాటం చూపరని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇదే. బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది.
– సూర్యప్రకాశ్, మెమాక్ కువైట్ ముఖ్య నిర్వాహకుడు
దేశవ్యాప్తంగా తెలంగాణ సంక్షేమ పథకాలు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రారంభించనున్నారన్న వార్త చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. బీజేపీ దుష్టపాలనను అంతమొందించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతియుత ఉద్యమంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. సీఎంగా స్వరాష్ట్రంలో విద్యుత్తు, నీటి సమస్యలు సహా అనేక పెద్ద సమస్యలను అలవోకగా పరిష్కరించారు. తెలంగాణలో ఆయన ప్రారంభించిన వినూత్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాలని కోరుకొంటున్నా.
– డాక్టర్ పీవీ శ్రీధర్, షిఫా మెడికల్‌గ్రూప్ మాజీ సీఈవో, కువైట్
మన విద్యావిధానం దేశమంతా అమలవ్వాలి
దూరదృష్టి గల సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను అక్కున చేర్చుకొన్న కేసీఆర్ సేవలు దేశవ్యాప్తం కావాలన్నదే ప్రజల ఆకాంక్ష. దేశంలో సుపరిపాలన జరగాలంటే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి సీఎం మన కేసీఆర్. తెలంగాణలో విద్యా వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నది. ఇదే తరహా సేవలు దేశవ్యాప్తం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గౌరవంగా, సంతోషంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది ప్రజాప్రయోజనాల కోసం పని చేసే ప్రభుత్వం. దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. దేశంలోని రైతులు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు తెలంగాణలో పుట్టడం మన అదృష్టం.
– నరేంద్ర బోగం, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీఎస్ కందవాడ, చేవెళ్ల, రంగారెడ్డి
No comments:
Post a Comment