గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, September 12, 2022

మోటర్లకు మీటర్లే.. అసలు మ్యాటర్‌!

 

మోటర్లకు మీటర్లే.. అసలు మ్యాటర్‌!

 

మోటర్లకు మీటర్లే.. అసలు మ్యాటర్‌!
  • కొత్త కనెక్షన్లకు మీటర్లు తప్పనిసరి అంటున్న గెజిట్‌
  • ఉన్నవాటికి మీటర్లు పెడితే ఎఫ్‌ఆర్బీఎం పెంచుతామని ఆఫర్‌
  • అలాంటి ఆదేశాల్లేవంటున్న బీజేపీ
  • బండన్నా రాజీనామా ఎప్పుడు చేస్తవ్‌?.. నిలదీస్తున్న నెటిజన్లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో తెచ్చేవన్నీ తేనె పూసిన కత్తులే. ప్రతి సంస్కరణ ప్రజల బతుకులను గాయపరిచేదే. ఇప్పుడు విద్యుత్తు సంస్కరణలైనా.. బాయికాడ మీటర్లయినా అలాంటివే. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం 2020లో నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా సైతం విడుదల చేసింది. కానీ.. రైతుల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడం, ఆందోళనలకు పిలుపునివ్వడం, కేసీఆర్‌ సహా అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఎదురుతిరగడంతో అప్పుడు వెనక్కి తగ్గింది. కొత్త తరహా ప్లాన్‌తో ఇప్పుడు ముందుకొచ్చింది. నేరుగా కాకుండా పరోక్షంగా మోటర్లకు మీటర్లు పెట్టేలా రెండు కీలక చర్యలు తీసుకున్నది.

1) కొత్త నిబంధనలతో గెజిట్‌: విద్యుత్తు చట్టం-2003లో కొత్త నిబంధనలు పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 31న గెజిట్‌ విడుదల చేసింది. ఇందులోని 5వ క్లాజ్‌లోని 1వ నిబంధనలో ‘ఇకపై కొత్తగా ఇచ్చే ప్రతి విద్యుత్తు కనెక్షన్‌కు స్మార్ట్‌మీటర్‌ లేదా ప్రీపెయిడ్‌ మీటర్‌ బిగించాలి’ అని స్పష్టం చేసింది. అంటే 2020 డిసెంబర్‌ 31 తర్వాత తీసుకునే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు కూడా ఇది వర్తిస్తుంది.

2) ఎఫ్‌ఆర్బీఎంతో మెలిక: ఇప్పటికే ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు ‘ఎఫ్‌ఆర్బీఎం పరిమితి పెంపు’ అనే తాయిలం చూపించింది. 2021 జూన్‌ 9న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ర్టాలకు ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం పెంచనున్నట్టు చెప్పింది. ఇందుకోసం రాష్ర్టాలు విద్యుత్తు సంస్కరణలను అమలు చేయాలని సూచించింది. ఆ సంస్కరణల ప్రకారం ప్రతి మోటరుకు మీటరు బిగించాల్సి ఉంటుంది. అప్పుడే 2021-22 నుంచి 2024-25 వరకు ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం పెంచుతారు.

కేంద్రప్రభుత్వం 2021 డిసెంబర్‌ 31న విడుదల చేసిన గెజిట్‌ను ఉపసంహరించుకున్న దాఖలాల్లేవు. అంటే.. కొత్త మీటర్ల నిబంధన ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్టు లెక్క. ఇక ఎఫ్‌ఆర్బీఎం పరిమితి కోసం ఇప్పటికే ఏపీ, గుజరాత్‌, యూపీల్లో మోటర్లకు మీటర్లు పెట్టడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని, ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్వయంగా ఏపీ సీఎం ప్రకటించారు. 2023 జూన్‌ నాటికి బిగింపు పూర్తి చేస్తామని స్వయంగా ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఈ ఏడాది మే నెలలో ప్రకటించారు. మీటర్ల వ్యవహారంపై శ్రీకాకుళంలో రైతులు తిరబడి, ఆందోళనలు సైతం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ మీటర్లు బిగించారు. వారానికే సుమారు 8 వేల వరకు బిల్లులు రావడంతో ఉమాన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతులు మీటర్లను పీక్కెళ్లి కరంటాఫీసులో పడేశారు. గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడా రైతులు ఎదురు తిరిగారు.

పేరుకు మాత్రమే ఫీడర్‌ మీటర్లు..?
దేశవ్యాప్తంగా రైతులు, ప్రభుత్వాలు భగ్గుమనడంతో కేంద్రం తన నిబంధనలకు మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నించింది. వ్యవసాయ కనెక్షన్లకు నేరుగా మీటర్లు కాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫీడర్‌ మీటర్లు పెట్టాలని ప్రతిపాదించింది. కానీ.. గెజిట్‌లో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నామని గానీ, ఎఫ్‌ఆర్బీఎం పరిమితి కోసం చేయాల్సిన సంస్కరణలను అమలు చేయొద్దని కానీ చెప్పలేదు. కేంద్రం గతంలో గ్యాస్‌ సబ్సిడీని కంపెనీలకు కాకుండా నేరుగా లబ్ధిదారులకే వేస్తామని, అక్రమాలకు తావుండదని నమ్మబలికింది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీని ఎత్తివేసింది. ఇదేతరహాలో ఇప్పుడు ఫీడర్‌ మీటర్లు అని చెప్పినా.. భవిష్యత్తులో వాటిని మోటర్లకు బిగించరని నమ్మకం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్‌ సబ్సిడీ తరహాలో ఆ ఫీడర్‌ మీటర్‌ పరిధిలోని రైతులు ముందుగా బిల్లు కట్టాలని ,ఆ తర్వాత ఆ మొత్తం అకౌంట్లో వేస్తామని మోసం చేయరని హామీ ఇవ్వగలరా? అని నిలదీస్తున్నారు.

తెలిసీ బీజేపీ నేతల దాగుడుమూతలు
ఇంత జరుగుతున్నా.. తమ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదంటూ బీజేపీ నేతలు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మీటర్ల విషయం నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ చెబుతూ వచ్చారు. అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్‌కు సంబంధించి బండి సంజయ్‌ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఒకటి.. కేంద్రం గెజిట్‌ ఉపసంహరించుకున్నదా? రెండు.. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి నిబంధనలను మార్చిందా?. కేంద్రం విద్యుత్తు మీటర్లకు సంబంధించి చేస్తున్న ఒత్తిళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో సోమవారంనాటి చర్చ సందర్భంగా కుండబద్ధలు కొట్టారు. ఈ నేపథ్యంలో ‘బండి సంజయ్‌.. ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు?’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment