గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, September 12, 2022

గాంధీ పుట్టిన దేశమా ఇది?

 


September 13, 2022 / 04:10 AM IST

గాంధీ పుట్టిన దేశమా ఇది?

మహాత్ముడి నేలపై మరుగుజ్జుల ప్రేలాపన

జాతీయ జెండానూ మార్చేస్తామంటున్నరు

ప్రజాస్వామ్యం వద్దట.. ప్రభుత్వాల్ని కూలుస్తరట

ఎవరిని తీసేయాలో ప్రజలకు బాగా తెలుసు

పేరుకే మేకిన్‌ ఇండియా.. అన్నీ చైనా నుంచే

ఆర్టీసీనీ అమ్మాలని కేంద్రం లేఖలు రాస్తున్నది

బియ్యం ఎగుమతులపై ఆంక్షలు పెట్టారు

అప్పుడు బియ్యం కొనేది లేదన్నవాళ్లు

ఇప్పుడు నిషేధం ఎందుకు విధించారు?

రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది

బీజేపీ పాలనావిధానాలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

పార్లమెంట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టాలని సూచన

వీఆర్‌ఏలపై త్వరలోనే నిర్ణయమని వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (నమస్తే తెలంగాణ): మహాత్ముడి నేలపై మరుగుజ్జులు ప్రేలాపనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమవారం కేంద్ర విద్యుత్తు బిల్లు- పర్యవసానాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత విధానాలపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

బీజేపీని దేవుడు కూడా కాపాడలేడు..

చాలా బాధ కలుగతది. భట్టి ఒక మాట చెప్పారు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొద్దని కేంద్రం అంటున్నది. బీజేపీకి చెందిన వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు.. ‘చంపేస్తం, కోసేస్తం, ఎన్‌కౌంటర్లు చేస్తం’ అంటూ మాట్లాడుతున్నరు. ‘ఏక పార్టీ ఉంటది.. వేరే పార్టీని ఉంచం. ఉండకుండ చేస్తం’ అని కేంద్రమంత్రి నిస్సిగ్గుగా ప్రకటిస్తడు. కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తది. ఇండ్ల మీద జాతీయ జెండా ఎగరేయకండని అంటున్నరు. జాతీయ జెండానే మార్చేస్తం అంటున్నరు. ఇది మహాత్ముడు పుట్టిన గడ్డనేనా? ఈ మరుగుజ్జులు మాట్లాడుతున్న మాటలు వినాల్సిన ఖర్మనా మనది? ఎక్కడి నుంచి దాపురించారీ దరిద్రులు? ఈ రోజు చాలా బాధతో చెప్తున్నం. దీనికోసమేనా అంబేద్కర్‌ రాజ్యాం గం రాసింది? ఇదేనా స్ఫూర్తి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇవి దేశాన్ని నడిపే పెద్దలు మాట్లాడాల్సిన మాటలేనా? శాంతి, సహనం, అహింసతోని స్వరాజ్యం తెచ్చిన మహాత్ముడు పుట్టిన నేల ఇది. ఎవరికి కిరీటం పెట్టడానికి ఈ అరుపులు, పెడబొబ్బలు? బీజేపీకి ఏనాడూ 50 శాతం ఓట్లు రాలే. ఇవాళ కేవలం 36% ఓట్లతో రాజ్యాన్ని ఏలుతున్నరు. అధికారం తాత్కాలికం. చరిత్రలో హిట్లర్లు, నెపోలియన్లు, ముస్సోలినిలు చాలామంది పోయారు. కాలమే సమాధానం చెప్తది. ప్రజలందరూ రికార్డు చేస్తున్నరు. భయంకరమైన పరిస్థితులున్నయ్‌. ఇంకో 20 నెలల్లో బీజేపీని దేవుడు కూడా కాపాడలేడు.

యువకుల గుండె మంటను ఆర్పలేరా?

మరింతమంది ఏక్‌నాథ్‌ షిండేలు వస్తరని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంటున్నడు. సొంతంగా ఎమ్మెల్యేగా గెలవని ఆయన కూడా ప్రభుత్వాలను కూలుస్తమంటున్నడు. ఇలాంటివి ఎన్నింటినో ఈ దే శం చూసింది. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తిరుగుబాటు చేసి ఒక్క పిలుపునిస్తే 50 రోజుల్లో జైళ్లలో పుట్టిన జనతాపార్టీ ఈ దేశం మీద జెండా ఎగిరేసింది. అది ఈ దేశ ప్రజాస్వామ్య గొప్పతనం. సమయం వచ్చినప్పుడు ప్రజలే చూపిస్తరు. ఎప్పుడూ లేనంతగా రూపాయి ధర పతమైతన్నది. విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నయి. అం తర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దిగజారిపోతున్నది. మన అంబాసిడర్లను పిలిచి ఇతర దేశాలు నిలదీస్తున్నయి. ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తమని పైస వెయ్యలేదు. 20లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటయ్‌. వాటిని నింపరు. ఏ ఒక్కటన్న ఫలితం ఇచ్చిందా? ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టిండ్రా? పేదలను ఆదుకున్నరా? అతిపెద్ద, సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించినది. సైన్యం రిక్రూట్‌మెంట్‌ను ఇష్టమొచ్చిన రీతిలో మార్చేస్తే ఎలా అట్టుడికిందీ దేశం! పోలీసులను దించి ఆందోళనను అణిచివేసిండ్రు కానీ, యువకుల గుండెల్లో రగిలే మంటలను ఆర్పలేరా మీరు? ఆ మంటలు మిమ్ములను దహించవా? ఎందుకు మీకీ అహంకారం?

ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు

సంస్కరణను అమలు చేస్తే కేంద్రం రూ.వెయ్యి కోట్ల బహుమతి పెట్టింది. ఆర్టీసీని అమ్మేయాలని లెటర్లపై లెటర్లు వస్తున్నాయి. ఎవరు ముందు అమ్మితే వారికి రూ.వెయ్యి కోట్ల బహుమతిని ఇస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రాష్ర్టానికి లేఖలు రాసింది. మొత్తం అమ్మేయాలనేది కేంద్రం ఉద్దేశం. మేం అమ్ముతున్నం కాబట్టి, మీరు కూడా అమ్మేయండని చెప్తున్నది.

బియ్యంపై ఆంక్షలు.. రైతుల నోట్లో కేంద్రం మట్టి

ధాన్యం కొనాలని కోరుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలందరం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినం. ధాన్యం కొనండి అంటే ‘మేం కొనం’ అంటరు. కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెడతరు. ఇక్కడి నుంచి ఉన్న కేంద్ర మంత్రి, ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతరో ఆ భగవంతునికే ఎరుక. ‘ఏయ్‌ వెయ్యండి వరి.. మొత్తం వెయ్యండి. కొనిపిచ్చే బాధ్యత మాది’ అన్నరు. ఆ తర్వాత ఎవడు ఎక్కడ పోయిండో పత్తా లేదు. చెప్పినోడు పారిపోతే.. ఇక్కడి నుంచి ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర మంత్రులు నిష్క్రియాపరులైతే టీఆర్‌ఎస్‌ నేతలు అక్కడ కొట్లాడుతుంటే.. ఆ పార్టీ నేతలు సంఘీభావం కూడా తెలుపలేదు. చివరికి గవర్నమెంట్‌ గవర్నమెంటే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినం. ఈ సందర్భంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి మరికొంత మంది మంత్రులు వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి మా వడ్లు కొనండని అడిగితే. ‘ఇంత ఎట్ల పండింది? మీరేమన్న మాయ చేశారా?’ అని మాట్లాడిన్రు. వచ్చి చూసుకొని పోమ్మన్నం. ‘మేం కొనం.. మాకు జాగలేదు.. కొని ఎక్కడ పెట్టుకోమంటున్నవ్‌’ అన్నడు. యాసంగిలో నూకలైతయి కాబట్టి ఎప్పుడు కొన్నట్టే బాయిల్డ్‌ రైస్‌ కొనండంటే.. ‘మేం కొనం. మీ తెలంగాణ ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయండి’ అని అవమానించారు. కానీ ఈ రోజు ఫలితం ఏమిటి? ఈ కేంద్ర ప్రభుత్వ ముందుచూపు లేమి, అసమర్థ విధానాలు, అవివేక చర్యల వల్ల దేశమే ఆహార సంక్షోభంలోకి వెళ్లింది.

నాలుగైదు నెలల కింద మేం బియ్యం కొనాలని ధర్నా చేసే పరిస్థితి ఉండే. ఇప్పుడు నూకల ఎగుమతి కూడా బ్యాన్‌ చేసే పరిస్థితి. రైతులకు వచ్చే ధర రాకుం డా ఈ తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం పది రూ పాయిలు ఎక్కువ దొరికే సమయంలో రైతుల నోట్లో మళ్లీ మన్నుకొట్టింది. యూరప్‌, అమెరికాలో కరువు ఉన్నది. ఉక్రెయిన్‌ యుద్ధంతో వచ్చిన ఇబ్బందులతో డిమాండ్‌ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అడ్డం తగిలి నూకల ఎగుమతిని బ్యాన్‌ చేసి, బియ్యం ఎగుమతిపై 20% పన్ను వేసి రైతులను దెబ్బకొట్టింది. ఇవన్నీ నిజాలు కావా? దీనిపై ఎక్కడంటే అక్కడ చర్చ కు మేం సిద్ధం. ఇలా ఎన్ని రంగాలను నాశనం పట్టిస్తారు? ఉప ఎన్నిక సందర్భంగా నేను బాన్సువాడ వస్తుంటే.. ఓ 10 కిలోమీటర్ల మేర మొక్కజొన్న ఉన్నది. ఇందులో కొంత మేర పాడైతే.. కొంత బాగుంది. అక్కడ నేను ఆగగానే లంబాడ పిల్లలు నా దగ్గరికి వచ్చారు. ‘చేను బాగున్నది.. ఏ విధంగా పండిస్తున్నరు?’ అని అడిగిన. పోచారం శ్రీనివాస్‌రెడ్డి గతంలో మం త్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి అవసరాన్ని బట్టి సబ్‌ స్టేషన్లు పెట్టించారని, దీంతో ఎకరా రెండెకరాల భూమిని బ్రహ్మాండంగా పండించుకొన్నామని తెలిపారు. వారు చాలా గర్వంగా మీ పేరు (స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి) చెప్పారు. మరికొంత చేను ఎందుకు బాగాలేదని అడగ్గా.. ‘సబ్‌ స్టేషన్లయితే సారు పెట్టించారు కానీ సరఫరా సారు చేతుల్లో లేదు కదా!’ అన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా ఆయన చే యాల్సింది చేశారన్నారు. పై నుంచే కరెంట్‌ వస్తలేదు కాబట్టి ఆయన ఏం చేస్తారని ప్రశ్నించారు.

పేదల పొట్ట కొట్టకండి..

మోకాలెత్తు లేనోడు, అరికాలెత్తు లేనోడు ఎవరిని పడితే వాళ్లను, ఎట్లా పడితే అట్లా అంటే ఎట్లా? ఇదేం రాజకీయం? ఏం జరుగుతున్నది ఈ దేశంలో? ఎవరిని భయపెడుతున్నరు? ఇది పోరాటాల గడ్డ. పౌరుషాల గడ్డ. ఈ పిట్ట బెదిరింపులతో, అవాకులు చవాకులతో తెలంగాణ బిడ్డలు బెదిరేటోళ్లు కాదు. అట్లా బెదిరేటోళ్లే అయితే 60 ఏండ్ల బంధనం తెంచుకొని తమ రాష్ట్రం సాధించుకునేవారు కాదు. 20 నెలల తర్వాత మీ మాటలన్నీ రివర్స్‌ అయితయి. మీ మాటలే ఉరితాళ్లయి దాపురిస్తయి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. ఇతర పార్టీల ప్రభుత్వాలను గౌరవించండి. ప్రజలను, వారి సెంటిమెంట్లను గౌరవించండి, పేదల పొట్ట కొట్టకండి.. అని కేంద్రానికి రాష్ట్ర రైతాంగం తరఫున, దేశ రైతాంగం తరఫున మనవి చేస్తున్న.

త్వరలో వీఆర్‌ఏలపై నిర్ణయం

వీఆర్‌ఏలకు గతంలో చాలీచాలని వేతనం ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.10వేల పైచిలుకుకు పెంచింది. మా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ మానవీయకోణం ఉంటది. ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెంచితే.. నేను పట్టుబట్టి, కిందివర్గాల ఉద్యోగుల పొట్ట నింపడం మన ధర్మమని చెప్పి, 30% పీఆర్సీని నాన్‌స్కేల్‌ ఎంప్లాయీస్‌కు కూడా వర్తింపజేసినం. పెద్దఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టులు వస్తున్నాయి. అవి నడవాలంటే లష్కర్‌ వ్యవస్థ ఉండాలె. ఇప్పటికే వీఆర్వోలను వేరే విభాగాల్లో సర్దుబాటు చేసినం. వీఆర్‌ఏల్లో అర్హులైన వాళ్లకు పేస్కేల్‌ ఇచ్చి ఇరిగేషన్‌శాఖలో అవకాశమిస్తాం. ఇంకొందరిని వేరే విభాగాల్లోకి తీసుకుంటం. అధ్యయనం జరుగుతున్నది. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.

శీతాకాల సమావేశంలో విస్తారంగా చర్చిద్దాం

ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి ఇరిగేషన్‌ లోన్లను ఆపుతున్నరు. దొంగ లెక్కల కింద ఎఫ్‌ఆర్‌బీఎం కింద కోతలు పెడుతున్నరు. పీయూష్‌ గోయల్‌ విద్యుత్తుశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్‌లో వాళ్ల ప్రభుత్వ సంస్థలు దివాలెత్తినయి. వాటిని బెయిల్‌ఔట్‌ చేయడానికి తెచ్చిన్రు ఉదయ్‌ అనే స్కీమ్‌. మనకి అవసరం లేకుండే. మనం దివాలెత్తలే. మన సంస్థలు మంచిగ పనిచేస్తున్నయ్‌. కానీ మీరు కూడా తీసుకోవాలన్నరు. మడుగుల పడ్డ దున్నపోతు మంచె కింద కూర్చుందంటురు గద.. మీరింత పూసుకోవాల బురద. ఇదే పీయుష్‌గోయల్‌ పదిసార్లు నా ఎమ్మట పడితే ఇష్టం లేకున్నా ఉదయ్‌ స్కీంలో చేరినం. ఏందా ఉదయ్‌ స్కీమ్‌? డిస్కంలకి ఇంతకుముందు ఏమైనా లోన్లు ఉంటే రాష్ర్టాలు తీసుకోవాలె. మనకు పదకొండున్నర- పన్నెండు వేల కోట్లు ఉండే. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల. తీసుకున్నం. ఎైట్లెనా మనకి కరెంటు తక్కువున్నది, స్థిరీకరణ చేసే అక్కెర ఉన్నదని తీసుకున్నం. దాన్ని కూడా అప్పుకింద పరిగణిస్తం, మీ ఎఫ్‌ఆర్‌బీఎంలో కోత పెడతం అన్నరు. వాళ్ల నోరుకైతే మొక్కాల.

పెన్షన్లు, రైతు బంధు ఎందుకివ్వాలి అంటున్నరు

ప్రశాంత్‌రెడ్డి, అజయ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఏడుగురో, ఎనిమిదిమందో మంత్రులు పోయిన్రు. మంత్రి చాంబర్‌లో మంది ఉంటే వాళ్లను బయటకి వెళ్లగొట్టి ఎందుకయ్యా మీరు రెండు వేల పెన్షన్లు ఇస్తున్నరు? దుబారా చేస్తున్నరు. మేం గుజరాత్‌లో 600 ఇస్తున్నం, మాకు ఏత్తలేరా ఓటు? మీరు పిచ్చోళ్లు. రైతుబంధు ఎందుకిస్తన్రు? అని మాట్లాడుతడు. ‘వడ్లు మీరెందుకు కొంటరు నా కర్థం కాదు. రైతులు రూ.1,200లకి అమ్ముకుంటరు.. అమ్ముకోనీయండి. ఏ రాష్ట్రంలో చెయ్యంది మీకెందుకు? మీరేమన్న పెద్ద సిపాయిలా?’ అని మాట్లాడిండు ప్రైవేట్ల. ఉదయ్‌ని తీసుకోమని ఆయనే నాఎమ్మట పడ్డడు. తీసుకున్న ఉదయ్‌ని మల్ల గోల్‌మాల్‌ తిప్పుతమంటే.. కోర్టుకు పోతమంటే మళ్ల ఇచ్చారు. మీరు ఎత్తుకోమంటె ఎత్తుకున్న భారం, అది ఎట్ల కట్‌చేస్తరు?

ఎవరిని తీసేయాలో ప్రజలకు తెలుసు..

భారతమాత గుండెకు గాయమైతున్నది. బుద్ధుడు పుట్టిన నేలమీద శాంతికి, సహజీవనానికి మారుపేరుగా నిలిచిన దేశంలో ఈ ప్రబుద్ధుల ప్రేలాపనలు మేధావులు, ప్రజాస్వామికవాదులను ఎంతో కలచివేస్తున్నవి. గాంధీ చిత్రపటం అనేక దేశాల్లో ఉంటది. విదేశాలకు వెళ్తే గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చారా? అని అడుగుతరు. ఈ దేశంలో బీజేపీ పాలనలో దేశంలో ఒక్కటన్న మంచి పని జరిగిందా? అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్నరు. ఇప్పటికే 11 రాష్ర్టాల ప్రభుత్వాలను కూలదోశారు. చెప్పుకోవడానికి సిగ్గుండాలె. తెలంగాణలో మూడు తోకలు లేవు. ‘తీసేస్తాం, కూలగొడతం’ అంటరు. ఎట్లా తీసేస్తరు? పోగాలం వచ్చింది కాబట్టే అట్ల మాట్లాడుతున్నరు. మూలం ఎక్కడ ఉన్నదనే సంగతి ప్రజలకు తెలుసు.

తెలంగాణలో కలుపుమంటున్నరు

మనకు పొరుగున కర్ణాటక, మహారాష్ట్రల్లో బీజేపీ ప్రభుత్వాలున్నయి. అక్కడి ప్రజలు తమకూ తెలంగాణ పథకాలు కావాలని, లేకుంటే తెలంగాణలో కలుపాలని అడుగుతున్నరు. నారాయణపేట, మక్తల్‌, తాండూర్‌, జుక్కల్‌, బాన్సువాడలల్ల మోటర్లు ఫుల్లుగా నీళ్లు పోస్తుంటయి. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో పొయ్యవు. సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇవి రోజూ కనబడుతయి. అక్కడి ప్రజలు ఇక్కడికి.. ఇక్కడోళ్లు అక్కడికి రోజూ వచ్చిపోతుంటరు. వాళ్లు తెలంగాణ గురించి చెప్పుకుంటరు. మహారాష్ట్రలో 40-50 గ్రామాల సర్పంచులు ‘తెలంగాణ పథకాలు మాకు కూడా అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలుపండి’ అని తీర్మానం చేసి పంపిన్రు. కర్ణాటకలోని రాయచూర్‌లో బహిరంగ సభలో బీజేపీ మంత్రిని కూర్చోబెట్టి మైక్‌లోనే.. ‘తెలంగాణ పథకాలు మాకూ ఇవ్వండి లేదా మమ్మల్ని ఆ రాష్ట్రంలో కలపండి’ అని అక్కడి ప్రజలు అడిగిన్రు. అక్కడి ఎమ్మెల్యేలు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నరు.


జాతీయ లక్షణం మీకున్నదా? మాకున్నదా?

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, నాందేడ్‌ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలకు చెందిన పేద రైతులు తెలంగాణలోని జుక్కల్‌, ముధోల్‌లోని సరిహద్దు గ్రామాల్లో గుంట, ఐదు గుంటలు, అద్దెకరం కొనుక్కొని, ఇక్కడ బోర్‌ వేసి మహారాష్ట్రలో పారించుకుంటున్నరు. నారాయణఖేడ్‌, గద్వాలలో బోర్లు వేసి కర్ణాటక గ్రామాల్లో పారించుకుంటున్న వాళ్లు కూడా ఉన్నరు. మన రాష్ట్ర విద్యుత్తు అధికారులు నా దగ్గరికి వచ్చి ఇట్లా 150-200 బోర్లు పెట్టారని ఫొటోలతో సహా చూపించారు. తీసేయాల్నా? అని నన్ను అడిగితే.. ‘వాళ్లు పేద రైతులు, మనం 66 లక్షల మందికి ఉచితంగా కరంటు ఇచ్చుకుంటున్నం. మన దగ్గర 24 గంటల కరెంటు ఉన్నది, బోర్లలో నీళ్లు పెరిగినయి. ఎంత జాగా ఉన్నా రైతుబంధు వస్తది. ఒకవేళ చనిపోతే రూ.5 లక్షలు వస్తయని వాళ్లు ఇట్లా చేస్తున్నరు. వాళ్లు కూడా మన భారతీయులే కదా తీసేయకండి..’ అని చెప్పిన. విశ్వగురువు నీతి అంటే ఇట్లుండాలె. పేదల మీద ప్రేమ అంటే ఇట్లుండాలె. వీళ్లేదో టేకేదార్‌ తీసుకున్నట్టు.. మీరు జాతీయ పార్టీ పెడుతరా? అని అంటున్నరు. మేం కాకపోతే మీరు పెట్టాల్నా? జాతీయ లక్షణం మాకున్నదా.. మీకున్నదా? జాతీయ స్ఫూర్తి, ఇరుగుపొరుగును ప్రేమించే స్ఫూర్తి ఎవరికి ఉన్నది? ఈ స్వతంత్ర భారతదేశంలో మహాత్ముడు, బుద్ధుడు పుట్టిన ఈ నేలలో, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం నీడలో ఈ సమానత్వమా ఉండేది? ఈ న్యాయమేనా జరిగేది? ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సి రావడం నా బ్యాడ్‌లక్‌. ఈ పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఇలాంటి దుష్ట సమయం రావొద్దు. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి లేచి కేంద్రాన్ని విమర్శించే దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు? దానికి ఎవరు బాధ్యులు? నేను దుఖంతో, బాధతో ఈ విషయం చెప్తున్న.


పార్లమెంట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టాల్సిందే..

చాలా ఉన్నత భావంతో, అణచివేతకు గురైన జాతుల గురించి అతి ఎక్కువగా తపించిన వ్యక్తుల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఒకరు. రాజ్యాంగ రచనలో ఆయన భాగం కాకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. అప్పట్లో ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నా ఒళ్లు జలదరిస్తది. రాష్ర్టాల విభజనపై రాజ్యాంగ కమిటీలో చర్చ జరిగినప్పుడు చాలామంది సభ్యులు విడిపోతామనుకునే ప్రాంతం ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్‌ చేయించాలని పట్టుబట్టారు. దీనిని అంబేద్కర్‌ తిరస్కరించారు. అప్పటికే రాత్రి కావడంతో తాను ఎందుకు వద్దంటున్నానో కాగితంపై రాసి తీసుకొస్తానని చెప్పారు. రాత్రంతా పడుకోకుండా ఈ ప్రతిపాదనను ఎందుకు ఒప్పుకోలేదో రాసి తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పాస్‌ చేయకపోయినా సరే.. పార్లమెంట్‌ తీర్మానంతో విభజనను ఆమోదించొచ్చని స్పష్టంగా చెప్పారు. దోపిడీకి గురవుతున్నవారు ఫిర్యాదు చేసుకునే జాగానే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌. కాబట్టి మళ్లీ అసెంబ్లీ తీర్మానం అంటే వాళ్లను అక్కడ్నే కట్టేసినట్టు అయితదని, దోపిడీదారులకే మళ్లీ వాళ్లను అప్పజెప్పినట్టు అయితదని వివరించారు. సభ్యులందరూ మారుమాట కూడా మాట్లాడకుండా అంబేద్కర్‌ ప్రతిపాదనను పాస్‌ చేయించి, రాజ్యాంగంలో పొందుపరిచారు. వారి పుణ్యమా అని అదే చట్ట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనం కొంత సుఖ పడుతున్నం. కాబట్టి కొత్త పార్లమెంట్‌ భవనానికి పెట్టడానికి అంబేద్కర్‌ను మించిన వ్యక్తి ఈ దేశంలో వేరెవరూ లేరు. దీనిపై మంగళవారం సభలో తీర్మానం ప్రవేశపెడతాం. విద్యుత్తు సంస్కరణలపై గతంలో మనం తీర్మానం చేసి పంపించాం. సాధారణంగా అసెంబ్లీ ఒకే తీర్మానాన్ని రెండుసార్లు చేయదు. అది మన గౌరవాన్ని మనం తీసుకున్నట్టే. కాకపోతే కేంద్రం విద్యుత్తు సంస్కరణలను ఇంకో రూపంలో తెచ్చింది. కాబట్టి రెండో దఫా వచ్చిన విద్యుత్తు సంస్కరణలను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ మరోసారి తీర్మానం చేస్తుంది.


No comments:

Post a Comment