గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, September 12, 2022

అణచివేతనే వారి అసలు మతం

అణచివేతనే వారి అసలు మతం

 
అణచివేతనే వారి అసలు మతం

ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ నిరంకుశ పాలనను విశ్లేషిస్తూ దేశ విదేశాలలో పలు వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఇందులో క్రిస్టోఫ జెఫెలో రాసిన ‘మోదీ’స్‌ ఇండియా’ (హిందు నేషనలిజమ్‌ అండ్‌ ది రైజ్‌ ఆఫ్‌ ఎథ్నిక్‌ డెమొక్రసీ) కూడా ఒకటి. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటం పరిపాటి. కానీ అన్నీ ఆదర్శవంతమైన ఉదారవాద ప్రజాస్వామ్యాలు (లిబరల్‌ డెమొక్రసీస్‌) కావనీ, భిన్న సంకర రూపాలలో ఉన్నాయనీ రచయిత అభిప్రాయపడ్డాడు. భారత దేశం ఒకప్పుడు కన్సర్వేటివ్‌ డెమొక్రసీగా ఉండేదనీ, ఆ తరువాత ‘ప్రజాస్వామ్య ప్రజాస్వామీకరణ’ (డెమొక్రటైజేషన్‌ ఆఫ్‌ డెమొక్రసీ) జరిగిందనీ, ఇప్పుడు మోదీ పాలనలో ఎథ్నిక్‌ డెమొక్రసీగా మారి, క్రమంగా హిందు రాష్ట్ర నుంచి నిరంకుశ హిందు రాజ్యంగా మారిపోయిందని వివరించాడు.

మన దేశంలో ప్రజాస్వామ్యం రూపాంతరం చెందిన విధానాన్ని తన కోణంలో రచయిత క్రిస్టోఫ జెఫెలో పుస్తకంలో వివరించారు. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు విధానాలను ప్రవచించినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకులపై, ప్రాంతీయంగా బలంగా ఉన్న నేతలపై ఆధారపడవలసి వచ్చింది. దీనివల్ల కింది తరగతుల సంక్షేమ విధానాలను అమలు చేయలేకపోయింది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం కమిషన్‌ను నియమించింది. కానీ ఓబీసీలకు కోటా కల్పించాలన్న ఆ కమిషన్‌ సూచనను తిరస్కరించింది. ఇందిరాగాంధీ కాలంలో కూడా ఈ స్థానిక పెద్దలపైనే పార్టీ ఆధారపడవలసి వచ్చింది. అందువల్ల వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ఎటువంటి సంస్కరణలను చేపట్టలేదు. 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తరువాత రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ కొద్ది కాలంలోనే కాంగ్రెసేతర పక్షాల ప్రభుత్వం కూలిపోయింది. 1980 ఎన్నికలలో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారం చేపట్టిన తరువాత సామాజిక మార్పు అజెండాను పట్టించుకోలేదు. ప్రైవేటు రంగ అండతో ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. ఆ తరువాత రాజీవ్‌ గాంధీ కూడా ఇదే విధానాన్ని కొనసాగించాడు.

ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న భారత్‌లో ఇప్పుడు నిరంకుశ రాజ్య స్థాపన జరుగుతున్నదని రచయిత క్రిస్టోఫ జెఫెలో వివరించారు. మోదీతో సహా బీజేపీ నాయకులెవరూ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యతత్వాన్ని, భిన్నత్వాన్ని అంగీకరించరు. అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని కోరుకోరు.

రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీని ఇతర రాజకీయ పక్షాలు ఓడించడంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామీకరణ ప్రారంభమైందని పుస్తక రచయిత అభిప్రాయపడ్డాడు. 1977లో ఇందిరాగాంధీని, తరువాత రాజీవ్‌ గాంధీని ఓడించిన తీరులో సారూప్యాలు చాలా ఉన్నాయి. ఈ రెండు సందర్భాలలోనూ కాంగ్రెస్‌ను ఓడించిన పక్షాలలో భిన్నత్వం చాలా ఉన్నప్పటికీ, ఒక సామ్యం కూడా ఉన్నది. ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలనే లక్ష్యం ఈ పక్షాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలే అని కాదు. స్థానికంగా బలంగా ఉన్న ఈ ఇతర కులాలు శూద్ర వర్గం కిందికే వస్తాయి. హరిత విప్లవం వల్ల లబ్ధి పొందిన రైతు వర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నత వర్గాల ప్రాతినిధ్య పార్టీ కాగా, 1977 నుంచి 80 వరకు అధికారం నెరిపిన జనతా పార్టీ, 1989 నుంచి 91 వరకు పాలించిన జనతాదళ్‌ కింది తరగతులకు ప్రత్యేకించి వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహించేవి. ఓబీసీల స్థితిగతులు, వారి పురోభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సూచించడానికి జనతా పార్టీ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దానిని పట్టించుకోలేదు. కానీ జనతాదళ్‌ అధికారంలోకి రాగానే ఈ కమిషన్‌ సూచనల మేరకు బీసీలకు కోటాను అమలు చేయతలపెట్టింది.

మండల్‌ కమిషన్‌ సూచనల అమలుకు వ్యతిరేకంగా ఉన్నత వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన తమను అవమానించేదిగా ఉందని భావించిన బీసీలు సమీకృతమయ్యారు. బీసీలు ఉన్నత వర్గాలకు కాకుండా బీసీలకే ఓటేయడం ప్రారంభించారు. దీనివల్ల విద్యావంతులు కానట్టి గ్రామీణ ప్రజాబాహుళ్యం రాజకీయ రంగంలో ఒక ప్రబల శక్తిగా అవతరించింది. ఇదొక నిశ్శబ్ద విప్లవం. జనతాదళ్‌ వంటి ప్రాంతీయ పార్టీల మూలంగా హిందీ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యే బీసీల సంఖ్య రెట్టింపయి ఇరువై శాతానికి చేరుకున్నది. అనతికాలంలో జనతాదళ్‌ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ, ఆ పరిణామం ఆగలేదు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఓబీసీ అభ్యర్థులను భారీగా నిలబెట్టింది. దీంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓబీసీల సంక్షేమానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోసాగింది. ఇది ఉన్నత వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. మొదట ఉన్నత, మధ్యతరగతి వర్గాలు ఉదాసీనంగా వ్యవహరించాయి. 1990 దశకం చివర నుంచి 2000 సంవత్సరం వరకు ఓటేసిన వారి సంఖ్య తగ్గింది. ఆ తరువాత ప్రతిఘాత విప్లవాన్ని ప్రారంభించాయి. ఉన్నత వర్గాల ప్రతీకారానికి రాజకీయ రూపంగా బీజేపీ మారింది. రిజర్వేషన్‌ కులపరంగా కాకుండా ఆర్థికపరంగా ఉండాలని సూచించింది. 1920 దశకం నాటి హిందుత్వ సిద్ధాంతాన్ని చేపట్టింది. ఇస్లాం వల్ల ప్రమాదం ఉందనీ, కులాలకు అతీతంగా హిందు ఐక్యత అవసరమని బోధించడం మొదలుపెట్టింది. కోటా రాజకీయాల నుంచి ఓబీసీల దృష్టిని మళ్ళించడానికి బీజేపీ అయోధ్య ఉద్యమాన్ని లేవదీసింది. అద్వానీ స్వయంగా రథ యాత్ర చేపట్టింది మండల్‌ రాజకీయాలకు వ్యతిరేకంగానే.

1993లో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ వంటి కిందితరగతుల చేతిలో బీజేపీ పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దెబ్బకు చతికిల పడింది. బీజేపీకి ఇక బీసీలను నాయకులుగా మార్చక తప్పలేదు. హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌, ఉమాభారతి వంటి నాయకులను ముందు పెట్టి బీసీలను ఆకర్షించ ప్రయత్నించింది. అయితే కొద్ది కాలంలోనే బీజేపీలోని ఓబీసీ ఎంపీల సంఖ్య మళ్ళీ తగ్గిపోయింది. ఎంత చేసినా బీజేపీకి కొన్ని రాష్ర్టాలు చేతికి వచ్చాయే తప్ప కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ రాలేదు.1998 నుంచి 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాలలో భాగమైంది. ఈ దశలో నరేంద్ర మోదీ హిందుత్వ భావజాలానికి జనాకర్షణ నినాదాలను మేళవించి ప్రచారం చేసారు. అయితే ప్రచారార్భాటమే తప్ప ఆ నినాదాలను అమలు చేయలేదు. రాజ్యాంగం ప్రవచించిన లౌకికవాదానికి, అల్ప సంఖ్యాకవర్గాలకు బీజేపీ వ్యతిరేకి అని పుస్తక రచయిత వివరించారు.

మోదీ పాలన కొత్త తరహా నిరంకుశత్వంగా మారిపోయిందని పుస్తక రచయిత క్రిస్టోఫ జెఫెలో విశ్లేషించారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరిచింది. ఎన్నికల ప్రక్రియను పెడదారి పట్టించింది. మొదట్లో కొన్ని మూకల ద్వారా అల్ప సంఖ్యాకవర్గాలపై దాడులు సాగించేది. తరువాత అధికారికంగానే అల్పసంఖ్యాక వర్గాల వ్యతిరేక వైఖరిని చేపట్టింది.

మండల్‌ కమిషన్‌ సూచనల అమలుకు వ్యతిరేకంగా ఉన్నత వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన తమను అవమానించేదిగా ఉందని భావించిన బీసీలు సమీకృతమయ్యారు. బీసీలు ఉన్నత వర్గాలకు కాకుండా బీసీలకే ఓటేయడం ప్రారంభించారు. దీనివల్ల విద్యావంతులు కానట్టి గ్రామీణ ప్రజాబాహుళ్యం రాజకీయ రంగంలో ఒక ప్రబల శక్తిగా అవతరించింది. ఇదొక నిశ్శబ్ద విప్లవం.

ఉన్నతవర్గాల పునర్‌వైభవం, పేదలకు కడగండ్లు

హిందుత్వ నినాదంతో వెనుకబడిన వర్గాల ఎదుగుదలను దెబ్బకొట్టాలన్న బీజేపీ వ్యూహం ఫలించింది. మోదీ మొదటి పర్యాయం పాలనలోనే ఉన్నతవర్గాలు కోలుకున్నాయి. పార్లమెంటులోనూ, బీజేపీ పాలిత రాష్ట్ర అసెంబ్లీలలోనూ ఉన్నత వర్గాల సంఖ్య పెరిగిపోయింది. మోదీ పాలనలో ఓబీసీలను రాజకీయంగా దెబ్బతీయడం ఒక విషయమైతే, బలహీనవర్గాల సంక్షేమ పథకాలను నీరుగార్చడం మరొక అంశం. షెడ్యూల్డు కులాలు, పేదలు, గ్రామీణుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. పైకి స్వచ్ఛ భారత్‌ వంటి కంటితుడుపు పథకాల ప్రచారానికి భారీగా బడ్జెట్‌ కేటాయిస్తున్నది. మోదీ విధానాల ఫలితంగా కరోనా రావడానికి ముందే పేదరికం పెరిగింది. గ్రామీణ, నగర వ్యత్యాసాలు పెరిగాయి. సంక్షేమ పథకాలంటే పేదలను పరాధీనులుగా చేయడమేనని, ప్రభుత్వ నియంత్రణ నుంచి వ్యాపార రంగాన్ని తప్పించాలనే భావజాల వ్యాప్తి జరిగింది. పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ప్రత్యక్ష పన్నులు తగ్గి పరోక్ష పన్నులు పెరిగాయి. దేశ సంపద బడావ్యాపారుల పాలయింది. మోదీకి సన్నిహితులైన వ్యాపారస్థులకు లబ్ధి చేకూరింది.

ప్రజాస్వామిక వ్యవస్థల నిర్వీర్యం నిరంకుశ వ్యవస్థ స్థాపన

ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న భారత్‌లో ఇప్పుడు నిరంకుశ రాజ్య స్థాపన జరుగుతున్నదని రచయిత క్రిస్టోఫ జెఫెలో వివరించాడు. మోదీతో సహా బీజేపీ నాయకులెవరూ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యతత్వాన్ని, భిన్నత్వాన్ని అంగీకరించరు. అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని కోరుకోరు. ఇందుకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం సాగుతున్నది.

పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. ఇందులో వివరంగా చర్చించి విధాన నిర్ణయాలను తీసుకోవాలి. కానీ మోదీకి పార్లమెంటు అనే వ్యవస్థ అంటేనే గిట్టదు. అందుకే చర్చ జరగకుండానే బిల్లులను ఆమోదిస్తున్నారు. ప్రధాని పార్లమెంటుకు హాజరై చర్చలు వినరు, చర్చల్లో పాల్గొనరు. రెండేండ్లు మాత్రమే ప్రధానిగా ఉన్న దేవెగౌడ కన్నా మోదీ తక్కువగా మాట్లాడారు. మౌనంగా ఉండే మన్మోహన్‌ సింగ్‌ కూడా ఇంకా ఎక్కువ మాట్లాడారు, అంతకన్నా ఎక్కువగా చర్చలను వినేవారు. పార్లమెంటును పక్కన పెట్టి ఆర్డినెన్స్‌లు జారీ చేయడంలోనూ మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. పార్లమెంటులో మెజారిటీ ఉండి కూడామోదీ ప్రభుత్వం సగటున ఏడాదికి పదకొండు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది.

బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపి క్షుణ్ణంగా పరిశీలించాలి. మన్మోహన్‌ రెండవ ప ర్యాయం అధికారం చేపట్టిన తరువాత 68 బిల్లులను (71 శాతం)పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపించారు. మోదీ మొదటి పర్యాయం అధికారానికి వచ్చిన తరువాత 24 బిల్లులు (25 శాతం) మాత్రమే పంపించారు. 2020లో 19 బిల్లులు ఆమోదం పొందితే రెం డింటినే కమిటీలకు పంపించారు. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు కనుక సాధారణ బిల్లులను కూడా మనీ బిల్లుగా ప్రవేశపెడుతున్నారు. బిల్లును ప్రవేశ పెట్టినంక ఆమోదించడానికి రెండు రోజుల వ్యవధి ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశపెట్టిన రోజే ఆమోదింప చేస్తున్నారు. బిల్లు ముసాయిదాను సభ్యులకు చివరి క్షణం లో ఇచ్చి చదివే సమయం ఇవ్వడం లేదు. అం తా నామమాత్రంగా జరిగిపోతున్నది. వ్యవసాయ బిల్లులను కూడా తగిన చర్చ లేకుండానే ఆమోదించారు. రైతులలో ఆందోళన వల్ల చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది.

సమాచార హక్కు చట్టాన్ని కూడా మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2014 ఆగస్టులో ప్రధాన సమాచార కమిషనర్‌ పదవీ విరమణ పొందిన తరవాత ఏడాది వరకు కొత్తవారిని నియమించనే లేదు. ఆ తరువాత మిగతా కమిషనర్ల నియామకంలోనూ తాత్సారం చేసింది. దీంతో 2019 జూలై నాటికి 28, 442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రీయ సమాచార కమిషన్‌ పంపిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడం లేదు. ఆ తరువాత ఏకంగా ఆర్‌టీఐ చట్టాన్నే సవరించింది. సమాచార కమిషనర్ల ఐదేళ్ళ పదవీ కాలాన్ని రద్దు చేసింది. నిర్దిష్ట జీతాలు ఉండకుండా తన ఇష్టారీతిన ఇచ్చే విధంగా మార్పులు చేసింది. దీంతో సమాచార కమిషనర్లు మోదీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దైన్య స్థితి ఏర్పడింది. సీబీఐని, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ని కూడా మోదీ ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నది.

ఇతర పార్టీలను నిర్మూలించి ఏక పార్టీ నిరంకుశ పాలన ఉండాలని బీజేపీ కోరుకుంటున్నది. మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నది. ఆయా రాజకీయ పక్షాలకు ఇచ్చే ఎన్నికల నిధులలో అత్యధిక భాగం బీజేపీకి వచ్చే విధంగా అదీ పారదర్శకత ఉండకుండా మోదీ ప్రభుత్వం చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నది. మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ మొదలైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసింది. రాష్ర్టాలలో బలమైన అధికార కేంద్రాలు ఉండకుండా చిదిమేయాలని చూస్తున్నది. ప్రతిపక్షాలను వేధిస్తున్నది. దేశవ్యాప్తంగా నిరంకుశ వ్యవస్థ స్థాపన కోసం అడుగులు వేస్తున్నది.

ఉన్నత వర్గాల ప్రతీకారానికి రాజకీయ రూపంగా బీజేపీ మారింది. రిజర్వేషన్‌ కులపరంగా కాకుండా ఆర్థికపరంగా ఉండాలని సూచించింది. హిందుత్వ సిద్ధాంతాన్ని చేపట్టింది. ఇస్లాం వల్ల ప్రమాదం ఉందనీ, కులాలకు అతీతంగా హిందు ఐక్యత అవసరమని బోధించడం మొదలుపెట్టింది. కోటా రాజకీయాల నుంచి ఓబీసీల దృష్టి మళ్ళించడానికి బీజేపీ అయోధ్య ఉద్యమాన్ని లేవదీసింది.

ప్రతిఘటన లేదెందుకు?

మోదీ నిరంకుశ విధానాలపై ప్రతిఘటన ఎందుకు ప్రబలడం లేదనే ప్రశ్నకు ఈ పుస్తకంలో రచయిత కొన్ని కారణాలు వివరించారు. మొదటిది- ఈ నిరంకుశ విధానాలు పైకి ఏర్పడకుండా గుంభనంగా అమలవుతున్నాయి. ‘హౌ డెమొక్రసీస్‌ డై’ అనే పుస్తకంలో రచయితలు లెవిట్‌స్కీ, జిబ్లాట్‌ వివరించినట్టు- పాతకాలపు నియంతల మాదిరిగా- సైనిక, హింసాయుత తిరుగుబాట్లు కనిపించవు. పార్లమెంటు ఉంటుంది, మీడియా ఉంటుంది. ఎన్నికలు జరుగుతుంటాయి. అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఒక్కో చర్య అల్పమైనదిగా కనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని మెల్లగా హరించివేస్తుంది. రెండవ కారణం- ఈ తరానికి ప్రజాస్వామ్యం విలువ తెలువదు. ప్రజాస్వామిక విధానాలు సాధారణమైపోయాయి. ఇక దేశ భద్రత విషయానికి వచ్చేసరికి బలమైన నాయకుడు ఉండాలనే భావన కలుగుతున్నది. మూడవ కారణం- అధికారానికి తలొగ్గడమనేది భారతీయుల మనస్తత్వంలో పాతుకుపోయి ఉన్నది. ఉన్నత వ్యక్తుల పట్ల విధేయత మరింత ఉంటుంది. గొప్పవారిని అభిమానించడంలో తప్పులేదు. కానీ వ్యక్తి ఆరాధన మంచిది కాదని (గాంధీని దృష్టిలో పెట్టుకొని)అంబేడ్కర్‌ అన్నారు. మోదీని గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ, ఆయన చేతలను గొప్పవిగా చూపడం వల్ల సాధారణ ప్రజల్లో అభిమానం పెరిగింది. నాలుగవ కారణం- చాయ్‌వాలానని మోదీ చెప్పుకుంటారు. తమవంటి ఒక పేదవాడు ప్రధాని అయ్యాడనే భావన పేద ప్రజల్లో ఏర్పడింది.

ఐదవ కారణం- మోదీ ప్రభుత్వం నెలకొల్పిన భయానక పరిస్థితి. దేశంలో హక్కుల ఉల్లంఘన భారీగా జరుగుతున్నది. పాత్రికేయులు, అధికారులు, న్యాయమూర్తులతో సహా అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. బదిలీలు, అరెస్టులు, ప్రభుత్వ ఏజెన్సీల దాడులు సాగుతున్నాయి. పౌరులు నిర్భయంగా అభిప్రాయాలు వ్యక్తం చేయలేని విషాద దశలో దేశం ఉందని బొంబాయి హైకోర్టు డివిజన్‌ బెంచి 2018లో వ్యాఖ్యానించింది. పారిశ్రామికవేత్తలు బహిరంగంగా అభిప్రాయాలు చెప్పగలిగే పరిస్థితి లేదని ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్‌ బజాజ్‌ కేంద్ర మంత్రి అమిత్‌ షా ముందే వెల్లడించారు. యూఏపీఏ వంటి నిరంకుశ చట్టాలను యధాలాపంగా ప్రయోగించడం ద్వారా దేశం పోలీసు రాజ్య స్వభావాన్ని సంతరించుకుంటున్నది. పాత్రికేయులపై దేశద్రోహ కేసులు పెడుతున్నది. పటిష్టమైన నిఘా వ్యవస్థను రూపొందిస్తున్నది. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఫోన్లు ఇతర పరికరాలపై నిఘావేస్తున్నది. సీసీటీవీల ఆధారంగా మరింత నిఘా పెరిగింది. ఢిల్లీ ఆందోళనల తరువాత 1100 మందిని గుర్తించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించడం ఇందుకు ఉదాహరణ. సోషల్‌ మీడియా పర్యవేక్షణ చేపట్టాలన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని 2018లో సుప్రీం కోర్టు ఆదేశించింది. అయినా వాట్సాప్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నది.

మోదీ ప్రభుత్వాన్ని దింపివేస్తే ఈ నిరంకుశత్వ ప్రమాదం తొలగిపోతుందని సుహాస్‌ పాల్షీకర్‌ 2019లో అభిప్రాయపడ్డారు. కానీ సంఘపరివార్‌ శక్తులు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రభుత ఏజెన్సీలలోనూ మాటు వే సి ఉన్నాయి. అందువల్ల బీజేపీ ప్రభుత్వం గద్దె దిగగానే ఈ నిరంకుశత్వ ప్రమాదం తొలగిపో దు. కాకపోతే ఈ ప్రమాదం నుంచి బయట ప డాలంటే మొదట మోదీని గద్దెదింపడం తప్పనిసరి అని పుస్తక రచయిత అభిప్రాయపడ్డారు.
-పుస్తక పరిచయం పరాంకుశం వేణుగోపాల స్వామి


No comments:

Post a Comment