బతుకుదెరువుకై
తట్టా బుట్టా
చేతిలో పట్టుకుని
ఊళ్ళో ఉన్నదంతా అమ్ముకుని
ఎన్నో
ఏళ్లకిందనే
గూడు కోసం జాగా కొన్నాము!
కూలీ పనులు చేస్తూ
ఒక పూట తిని తినక
పైసా పైసా జమచేసుకుని
ఇల్లు కట్టుకుని ఉన్నాము
అవును
మాకేం తెల్సూ
అమ్మినోడు,
పర్మిషన్ ఇచ్చినోడు
పెద్ద పెద్ద విల్లాల్లో జల్సాలు చేసుకుంటూ
మమ్మల్ని వీధిలో పడేస్తారని...!
ఈ 'హైడ్రా'జకీయంలో
బలయ్యింది
ఇంకా బలయ్యేది పేదోడే!
మాకు అమ్మినోని పిల్లలు
మాకు
పర్మిషన్ ఇచ్చినోని
పిల్లలు
విదేశాల్లో చదువుతున్నారు
అక్కడే స్థిరపడి నివసిస్తున్నారు
మరీ మేమేమో
రోడ్డున పడి దిక్కు లేకుండా అయ్యాము!
మాకు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి
ఇల్లు
కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు
ఇంటికి నంబర్ ఇచ్చారు
కరెంట్ కనెక్షన్ ఇచ్చారు
కుళాయి కనెక్షన్ ఇచ్చారు
ఇలా అన్ని ఇచ్చి కూల్చేశారు!
ఇలా అన్ని ఇచ్చిన మీరు
ఇలా అన్ని తప్పులు చేసిన
మీరు
కూల్చేసే ముందు
గూడును ఇవ్వాలని మరిచిపోయారు!
మా బతుకేందని అడిగితే
దిక్కున్న చోటికి వెళ్ళండన్నట్టు
పేదోడి బతుకును నడి బజార్లో పడేశారు!
- Kallem Naveen Reddy
No comments:
Post a Comment