గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Friday, January 27, 2023
దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది
సంచలనం : దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది
January 27, 2023జాతీయం, రాజకీయం
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ. ఆ ఎమర్జెన్సీని ఇందిరా గాంధీ విధించింది. అయితే… ప్రధాని మోడీ పాలనలో అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్. “ది లీఫ్ లెట్” అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ భూషన్… కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీజేపీ, మోడీ హయాంలో దేశ పౌరుల ప్రాథమిక హక్కులతో పాటు.. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈసీ, గవర్నర్ లాంటి వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు.
“ది లీఫ్ లెట్” ఇంటర్వ్యూ ఈ విధంగా మాట్లాడారు ప్రశాంత్ భూషన్… “గణతంత్ర భారత్‌లో గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. సెక్యులర్ రిపబ్లిక్ అనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతున్నది. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, మీడియా, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత ప్రశ్నార్థకమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో పోలిస్తే, దేశంలో ప్రస్తుతం అంతకంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో న్యాయవ్యవస్థ గొంతుకను కొంతవరకూ నొక్కిపెట్టారు. అయినప్పటికీ, పది హైకోర్టులు ప్రజల హక్కులకు అనుకూలంగా తీర్పును వెలువరించాయి. అయితే, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొన్నాయి. మైనారిటీ వర్గాలను ఓ భూతంగా చూపిస్తూ మోడీ ప్రభుత్వం వారిని బలిపశువులను చేస్తుంది. దానికోసం మీడియాతో పాటు సోషల్‌మీడియాలో విష ప్రచారం చేస్తుంది. విద్వేష, తప్పుడు ప్రచారాలను ఒక క్రమపద్ధతిలో తెరమీదకు తెస్తుంది. అదే నిజమంటూ నమ్మిస్తుంది. వాస్తవాలు, ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా గొంతునొక్కుతున్నారు. అలాంటి సోషల్ మీడియా అకౌంట్లపై ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్‌షిప్ విధిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి వాక్ స్వాతంత్రాన్ని కాలరాస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ లాంటి ద్వారా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎన్నికల కమిషన్ ను భ్రష్టు పట్టిస్తుంది. యూపీలోని రామ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌కు ముస్లింలను అనుమతించకపోవడమే దీనికి ఉదాహరణ. ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్‌కు సవరణల ద్వారా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మూడింట రెండొంతుల విరాళాలను బీజేపీనే దక్కించుకొంటున్నది. ప్రధాని మోడీ, ఆయన పార్టీకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించని పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయానుసారమే ఎన్నికలను ఈసీ నిర్వహిస్తున్నదని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించలేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రశాంత్ భూషన్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment