అరవై యేండ్ల గోసకు నవంబర్ 29 సాక్ష్యం
గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ స్వరాష్ట్రం కోసం పల్లెల్లో, పట్టణాల్లో, తండాల్లో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ ప్రభంజనం సృష్టించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపు యావత్ భారతదేశంలో రైతురాజ్యాన్ని స్థాపించేందుకు ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ సాధించేందుకు సిద్దిపేట సద్దికట్టి సాగనంపినట్లే ఇప్పుడు మన భూమి పుత్రునికి తెలంగాణ సద్ది కట్టి సాగనంపాలె. అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్నసమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎండబెట్టిన ఆంధ్ర పాలకుల దోపిడీకి నిదర్శనం. నిత్యం కరెంట్ కోతలు, కరెంట్ షాక్ లు, పిడుగులు, పాముకాట్లతో తెలంగాణ అల్లాడుతున్న రోజులవి. తెలంగాణ వస్తేనే మన బీడు భూముల దూపతీరుతుందన్నఆశ. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయన్న విశ్వాసం.ఆంధ్ర దోపిడీని చూస్తూ ఊర్కొంటే తెలంగాణ ప్రాంత బిడ్డల బతుకుల్లో ఆర్తనాధాలు తప్ప మరింకేం మిగలవనే భాధ. అప్పటికే రెండుసార్లు ఆంధ్రాపాలకులు ఉద్యమ కొలిమిని ఆర్పేశారు.ఆంధ్రా పాలకుల దోపిడీని అడ్డుకోవాలంటే మళ్లీ ఉద్యమానికి ఊపిరిపోయడం తప్ప మరో మార్గం లేదు. ఆరిన కొలిమిని మళ్లీ రాజేయలన్న కసి ప్రజల్లో నెలకొన్నది. చూస్తూ కూర్చొవడం కాదు, కొట్లాడటమొక్కటే మన ముందున్నతొవ్వ అని ప్రజలు పిడికిళ్లు బిగిస్తున్న సమయంలో కేసీఆర్ రూపంలో వారికి భరోసా దొరికినట్లయింది.ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా తన పదవులకు రాజీనామా చేశారు కేసీఆర్. పదవులు, ప్రాణం కన్న ప్రజల ఆత్మగౌరవమే ముఖ్యమని నమ్మారు. తన పదవులకు రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ అనేక చర్చలు, ఆలోచనలు,సమాలోచనలు, కసరత్తులు చేశారు. జెండా ఎత్తితే మడమ తిప్పని నైజం ఆయన సొంతం. స్వరాష్ట్ర జెండా ఎగిరేదాక వెన్నుచూపకూడదన్నది కేసీఆర్ లక్ష్యం. సిద్దిపేట ఉప ఎన్నిక ఉద్యమానికి వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది సిద్దిపేట. చారిత్రాత్మక ఉద్యమానికి, నాటిఉద్యమస్ఫూర్తికి అండగా నిలిచింది. ఉద్యమ పరిమళాలను నలుదిశలా వెదజల్లుతూ సిద్దిపేట ఉప ఎన్నిక నాంది పలికింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ అపూర్వ విజయం సాధించారు.తెలంగాణ లక్ష్య సాధన కోసమే ఆ రోజు కేసీఆర్ సిద్దిపేట ప్రజలు కట్టిన సద్దిమూటతో బయల్దేరాడు. తెలంగాణను సాధించిపెడుతానన్న ఒకే ఒక నినాదంతో గులాబీ ఉద్యమపతాకాన్ని చేతపట్టారు. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంలో ఆమరణదీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది. నవంబర్ 29.. ‘కేసీఆర్ చచ్చుడో-తెలంగాణ వచ్చుడో' అన్న ఒకే ఒక నినాదంతో కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టేందుకు కరీంనగర్ నుంచి బయల్దేరారు. కానీ ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రం దాటకుండానే 'అల్గునూర్ వద్ద అరెస్ట్ చేశారు. అక్కడినుంచి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్లనీయకుండా అడ్డుకోగలరు కానీ తన ఉద్యమ సంకల్పాన్ని అడ్డుకోలేరనితేల్చిచెప్పి కేసీఆర్ ఖమ్మం సబ్ జైల్లోనే ఆమరణదీక్షకు దిగారు. అంతే.. తెలంగాణ అంతటా అగ్నిగుండమై ఉద్యమ సెగలు ప్రజ్వలిల్లాయి. ఆందోళనలతో అట్టుడికింది. అదే సమయంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది.అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి దిగారు. దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించడంతో కేసీఆర్ను సబ్జైల్ నుంచి ఖమ్మం దవాఖానకు.. అక్కడినుంచి హైదరాబాద్ నిమ్క తరలించారు. నిమ్స్ఆరోగ్యం విషమిస్తున్నా... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతానని కేసీఆర్ శపథం చేశారు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడననే ఆయన ధైర్యానికి దేశం యావత్తు నివ్వెరపోయింది. దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వంతో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తదుపరి అనేక అడ్డంకులను అధిగమించి.. రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిననవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పునాదిలా నిలిచింది. ఆ సందర్భాన్ని ఏటా 'దీక్షా దివస్ గా రాష్ట్ర ప్రజలు జరుపుకొంటున్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడిరాష్ట్ర పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. తెలంగాణ పౌరుల పోరాటం, బలిదానాలు, త్యాగాలు, సకలజనుల సమ్మెలు, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమ ఎత్తుగడలతో శాంతియుత ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే.రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభివృద్ధిని కూడా ఉద్యమ పంథాలోనే సాగించారు. రాష్ట్రం సాధించిన తక్కువ సమయంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తన వ్యూహాలతో ఒకవైపు పార్టీని, మరోవైపు రాష్ట్రాన్ని పటిష్టం చేస్తూవచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఒరవడినిసృష్టించారు. కోటి ఎకరాల మాగాణి సాగు లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దేశంలోనే తొలిసారి రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతుబంధు పెట్టినా, 24గంటలు సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చినా అది కేసీఆర్కే సాధ్యమైంది. వ్యవసాయానికే కాదు కల్యాణలక్ష్మీ,ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, రైతు బీమా,చేనేత బీమా, దళిత బంధు ఇట్ల కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టుకొచ్చిన చారిత్రక ప్రగతి పథకాలెన్నో.నడుస్తున్నది కేసీఆర్ శకం. భావితరాలకు బంగారు తెలంగాణ నిర్మాతగా, అభివృద్ధికి దిక్సూచిగా కేసీఆర్ నిలిశారు. ఎన్నో పోరాటాల అడ్డాగా తెలంగాణ గడ్డ తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. రేపు దేశ, ప్రపంచ స్థితిగతులు, నడవడిక మార్పు దిశగా నడిపించే శక్తి కేసీఆర్.
No comments:
Post a Comment