ఆ గజదొంగల రాజ్యం కావాలా!?: కేసీఆర్
సూర్యాపేట సమరభేరిలో కేసీఆర్
కొడుక్కి ఓబులాపురం..
బిడ్డకు బయ్యారం
ఇదీ.. ఘనత వహించిన దేవుడి పాలన
నల్లగొండ, పాలమూరు నీళ్లను దోచుకుపోయిన దొంగ వైఎస్
వక్ఫ్ భూములతో రాజన్న బిజినెస్
అవన్నీ లగడపాటికి విక్రయం
ఇంత మంది ఐఏఎస్‌లు, మంత్రులు ఎప్పుడైనా జైల్లో ఉన్నారా?
ఇదంతా జగన్ దందాల పుణ్యం
తన బిడ్డపై కుట్ర చేశారని విజయమ్మ అంటోంది
సుప్రీం కోర్టు, హైకోర్టు కుట్ర చేసినట్టా
ఆంధ్రా పార్టీలను తరిమేస్తేనే శని పోతుంది
యాత్రల పేరిట ఉడుముల్లా మోహరించారు
మోకాళ్ల యాత్ర చేసినా బాబును నమ్మరు
పథకాలు ఎవరి సొత్తూ కాదు..
మనమూ ఇచ్చుకోగలం
ఇక భూకంపం పుట్టించే ఉద్యమాలు
"దొంగల రాజ్యం కావాలా!?
తెలంగాణ నిధులు, నీళ్లను దోచుకుపోయిన గజదొంగల రాజ్యం కావాలా!? భద్రాద్రి రాముణ్ని సైతం ముంచే జల దోపిడి రాజ్యం కావాలా!? వక్ఫ్ భూములను తన్నుకుపోయే గద్దల రాజ్యం కావాలా!?
తెలంగాణ గనులను బిడ్డలకు పంచే దోపిడీ రాజ్యం కావాలా!? ఐఏఎస్‌లు, మంత్రులను జైల్లో పెట్టించే దందాల రాజ్యం కావాలా!?
మన నోట మట్టికొట్టి, మన పొట్ట కొట్టే రాజ్యాలు కావాలా!? స్వీయ అస్తిత్వంతో కూడిన మన తెలంగాణ రాజ్యం కావాలా!? ఆలోచించండి''
- ప్రజలకు కేసీఆర్ పిలుపు
నల్లగొండ, నవంబర్ 25: "దొంగల రాజ్యం కావాలా!? తెలంగాణ నిధులు, నీళ్లను దోచుకుపోయిన గజదొంగల రాజ్యం కావాలా!? భద్రాద్రి రాముణ్ని సైతం ముంచే జల దోపిడీ రాజ్యం కావాలా!? వక్ఫ్ భూములను తన్నుకు పోయే గద్దల రాజ్యం కావాలా!? తెలంగాణ గనులను బిడ్డలకు పంచే దోపిడీ రాజ్యం కావాలా!? ఐఏఎస్‌లు, మంత్రులను జైల్లో పెట్టించే దందాల రాజ్యం కావాలా!? మన నోట మట్టిగొట్టి, మన పొట్ట కొట్టే రాజ్యాలు కావాలా!? స్వీయ అస్తిత్వంతో కూడిన మన తెలంగాణ రాజ్యం కావాలా!? ఆలోచించండి'' అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు, సీమాంధ్ర దోపిడీదారులను తరిమి కొట్టేందుకు భూకంపం పుట్టించే ఉద్యమాలతోపాటు రాజకీయ అధికారంతో శాసించేందుకు ద్విముఖ వ్యూహంతో సాగుతామని స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమానికి పదును పెడుతూనే.. రాజకీయంగా కూడా శక్తిమంతులం కావాలని, స్వీయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. ఉద్యమాల గడ్డ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ సమరభేరి సభలో జన సంద్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాదయాత్రల పేరిట తెలంగాణలో ఉడుముల్లా మోహరించారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు తెలంగాణ రాజ్యం కావాలని, రాజన్న, చంద్రన్న రాజ్యం కాదని స్పష్టం చేశారు. వాళ్లేమైనా గంధర్వులా, కిన్నెర కింపురుషులా అని ఎద్దేవా చేశారు. "రాజన్న రాజ్యం మనం చూళ్లేదా!? పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నల్లగొండ, పాలమూరు నీళ్లను దోచుకుపోయిన దొంగ వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా 600 మంది పోలీసులను కాపలా పెట్టి పులిచింతల కట్టించాడు. పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు రాజన్న రాజ్యం ఫలితాలు. పోతిరెడ్డిపాడు రెండు మూడేళ్లలోనే పూర్తయితే, నాలుగున్నర దశాబ్దాల కిందట ప్రారంభించిన ఎస్ఎల్‌బీసీ ఇంకా పెండింగ్‌లోనే ఉండడం రాజన్న రాజ్యం పుణ్యమే.
రాజన్న రాజ్యంలో పది వేల మంది రైతులు, 500 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్రాకు నీళ్లుపోయే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఎస్ఎల్‌బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి మూలపడ్డాయి. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. మన కడుపు నిండా నీళ్లు రాలేదు'' అని మండిపడ్డారు. లక్షల కోట్ల విలువైన నిజాం జాగీర్‌దారులు, వక్ఫ్ ఆస్తులను అమ్మకానికి పెట్టింది రాజన్న కాదా అని ప్రశ్నించారు. ముస్లిముల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములతో రాజన్న రాజ్యంలో బిజినెస్ చేశారని, వాటిని లగడపాటికి అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.
వక్ఫ్ భూములను గద్దల్లా తన్నుకుపోయే రాజన్న రాజ్యం కావాలా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యంలో కొడుక్కి ఓబులాపురం గనులను కట్టబెట్టాడని, బిడ్డకు, అల్లుడికి ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అయిన 1.47 లక్షల ఎకరాల్లోని బయ్యారం గనులను రాసిచ్చాడని విరుచుకుపడ్డారు. తెలంగాణ భూములు, ఆస్తులను దోచే గజదొంగల రాజ్యం కావాలా అని ప్రశ్నించారు. వద్దు అనేవాళ్లు చేతులు ఎత్తండని సభికులను కోరారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మంత్రులు, ఐఏఎస్‌లు ఎప్పుడైనా జైల్లో ఉన్నారా!? ఇది ఏ రాజ్యం పుణ్యం? ఐఏఎస్‌ల గౌరవం పోయేలా జైల్లో ఉండే దుస్థితి ఏ రాజ్యంలో ఉంది? జగన్ దందాల పుణ్యమిది.
దానినే ఆహ్వానిద్దామా? ఆలోచించండి. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించాయి. తెలంగాణకు నేను అడ్డం కాదు. నిలువు కాదు. వంద కోట్ల భారతీయులను అడగాలంటూ తెలంగాణను వైఎస్ ఎగతాళి చేశాడు. మన నోట మట్టిగొట్టిన రాజ్యాలు కావాలా?'' అని ప్రశ్నించారు. తన బిడ్డ మీద కుట్ర చేశారని, జగన్‌ను జైల్లో పెట్టించారని విజయలక్ష్మి అంటున్నారని, జగన్‌పై విచారణ ఎవరు చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. జగన్‌పై విచారణకు రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించాయని, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా కుట్ర చేసినట్టేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో మోసగించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ బాబు వస్తాడు.. పోలవరం కడతాడని విజయమ్మ అంటోందని, ఎస్ఎల్‌బీసీ కడతామని మాత్రం అనడం లేదని తప్పుబట్టారు. "వైఎస్‌కు అన్ని ప్రాంతాలూ సమానమని విజయలక్ష్మి అంటున్నారు. కడపలో రిమ్స్ పూర్తయిం ది. బ్రహ్మాండంగా ఉంది. బీబీనగర్ నిమ్స్‌లో గుడ్డిదీపం కూడా వెలగడం లేదు. యోగి వేమన వర్సిటీ పూర్తయింది. తెలంగాణ వర్సిటీ పడుకుంది. అన్ని ప్రాంతాలు సమానమైతే, ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడమేంటి? తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడమేంటి? ఆ రెండు రాజ్యాల్లో ఇంకా మోసపోదామా?'' అని ప్రశ్నించారు. లూటీ చేసిన వాళ్లను తలచుకుంటే మనకు కూడా పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజ్యంలో మన ప్రాజెక్టులను మనమే కట్టుకుందామని స్పష్టం చేశారు.
బాబు హయాంలో రిటైర్మెంట్లే.. రిక్రూట్‌మెంట్లు లేవు
చంద్రబాబు కాలంలో రిటైర్‌మెంట్లు తప్ప రిక్రూట్‌మెంట్లు లేవని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట ఉద్యోగాలను కుదించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. "చంద్రబాబూ..! విశ్వసనీయత సింగపూర్ దుకాణంలో దొరుకుతుందనుకుంటున్నావా? ఎక్కువ దొరికితే హెరిటేజ్‌లో పెట్టుకోవాలనుకుంటున్నావా? విశ్వసనీయత అంటే మాట నిలబెట్టుకోవటం'' అని చెప్పారు. కాళ్లు కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా చంద్రబాబును జనం నమ్మరని స్పష్టం చేశారు. గెలిచేది లేదని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఇటు చంద్రబాబు, అటు వైసీపీ నేతలు పింఛన్ల పేరిట అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి దాకా నాకిస్తున్నారని మండిపడ్డారు.
ఆఫర్ ఇచ్చినా మొండిచేయి
తెలంగాణ ఇస్తాం.. మాట్లాడదాం రమ్మని ఢిల్లీ పెద్దలు ఆహ్వానించారని, వారిపై నమ్మకం లేకపోయినా వెళ్లి మాట్లాడానని కేసీఆర్ వెల్లడించారు. పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామని చెప్పారని, వందల మంది నాయకుల భవిష్యత్తును పణంగా పెట్టి విలీనానికి సిద్ధపడ్డామని, అయినా కాంగ్రెస్ బుద్ధి మారలేదని, అంత మంచి ఆఫర్ ఇచ్చినా మొండిచేయి చూపిందని మండిపడ్డారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉసురు పోసుకుంటోందని, తెలంగాణకు వైఎస్ అడ్డం పడితే, వచ్చిన తెలంగాణకు అడ్డం పడుకున్నది చంద్రబాబేనని, పార్లమెంటులోనే జగన్ ప్లకార్డు పట్టుకున్నాడని, ఆ పార్టీలు శఠగోపం పెట్టే పార్టీలని దుయ్యబట్టారు.
తెలంగాణలో ఆ పార్టీలు అవసరం లేదని, వాటిని తరిమేస్తేనే శని పోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలతోనే పార్లమెంటును వారం రోజులపాటు స్తంభింపజేశామని, అదే 12 మంది ఎంపీలుంటే పార్లమెంటు నడుస్తుందా అని ప్రశ్నించారు. వందమంది అసెంబ్లీలో గులాబీ కండువాలు కప్పుకొంటే సభ నడుస్తుందా అని ప్రశ్నించారు. స్వీయ అస్తిత్వం కావాలని, స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాజ్యంలో ఆరోగ్య శ్రీని మెరుగైన రీతిలో అమలు చేస్తామన్నారు. చిత్తూరు ఉత్సవాలకు రూ.140 కోట్లు, శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలకు రూ.100 కోట్లు కేటాయించి కాకతీయ ఉత్సవాలకు డబ్బులు లేవంటూ వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు.
కాకతీయ ఉత్సవాలకు రూ.100 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పుష్కర కాలంలో టీఆర్ఎస్ ఉద్యమ నైపుణ్యాన్ని నేర్చుకుందని, జేఏసీ ఆ«ధ్వర్యంలో ఉద్యమానికి పదును పెడుతూ స్వీయ రాజకీయ అస్థిత్వం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. మంత్రి గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కోదండరాం వినయంగా మూడుసార్లు క్షమాపణలు చెప్పారని, అయినా, ఇంకా వివాదమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు.
కోదండరాం వ్యాఖ్యలకు నిరసనగా కొంతమంది సూర్యాపేటలో పోటీ సభ పెడతామని వచ్చారని, ఈ సభకు పోటీ సభ పెట్టగలరా? అని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదికను ఉద్దేశించి సవాల్ చేశారు. సూర్యుడిపై ఊస్తే మనపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సమరభేరిలో టీఆర్ఎస్, ఉద్యోగ సంఘాల నేతలు పేర్వారం రాములు, స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ప్రసంగించారు.
డిసెంబర్ 23 విద్రోహ దినం: కోదండరాం
రాబోయే వారం రోజుల్లో జేఏసీ కార్యాచరణను వెల్లడిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. బియ్యం, పింఛన్లు మన హక్కు అని, 35 కేజీల బియ్యం ఇవ్వాలని కోర్టులే చెబుతున్నాయని గుర్తు చేశారు. డిసెంబర్ 23న విద్రోహ దినం పాటిస్తామని, పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. "మేం ఆంధ్రా ప్రజలను వ్యతిరేకించడం లేదు.
ఆ పాలకులు, పార్టీలనే వ్యతిరేకిస్తున్నాం. డప్పు కొట్టి దండోరా వేసి ఇదిగో పోరాటం చేద్దామని టీఆర్ఎస్, జేఏసీ అంటే ఆ పోరాటంలోకి వైసీపీ, టీడీపీ వస్తాయా' అని ప్రశ్నించారు. ఐక్యంగా నిలబడి ఢిల్లీ పాలకులు, సీమాంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment