గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Friday, August 3, 2012
ద్వేషాలతో సమైక్య రాష్ట్రం, అసత్యాలతో ప్రత్యేక రాష్ట్రం - తెలుగు ప్రజలకీ రెంటిలో ఏదీ శ్రేయస్కరం కాదు.
ద్వేషాలతో సమైక్య రాష్ట్రం, అసత్యాలతో ప్రత్యేక రాష్ట్రం - తెలుగు ప్రజలకీ రెంటిలో ఏదీ శ్రేయస్కరం కాదు.
Posted by ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్)
తెలంగాణా సెంటిమెంటులో ఉన్న నిజాయితీని గౌరవిస్తూ, విభజన కోరుకోవడానికిగల చారిత్రక కారణాలను విశ్లేషిస్తూ, విభజనను సీమాంధ్రులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ, కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ చింతనవల్లే సీమాంధ్ర ప్రాంతంలోని సామాన్యుల్లో విభజన అంటేనే అదేదో మిన్ను విరిగి మీద పడ్డట్లు అనే భావన కలిగిందనే నిజాన్ని విషదపరుస్తూ, అదే సమయంలో ఓ రాష్ట్ర విభజన అంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుని అవతలివాళ్ళ భయాలనూ-వనరుల పంపిణీవంటి క్లిష్టాంశాలనూ ఉభయామోదయుతంగా పరిష్కరించుకోవాలనే ఇంగితం కొరవడిన నేతల చేతల్లో తెలంగాణా ఉద్యమం పడడంవల్ల ప్రజల మద్య సరిదిద్దలేని విభజన ఎలా ఏర్పడిందనే విషయాలమీద నేను మరో విష్లేషణాత్మక వ్యాసం రాద్దమనుకుంటున్న టైంలో శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు గారు దాదాపుగా అవే అంశాలతో ఓ మంచి విశ్లేషణాత్మక వ్యాసం వ్రాసారు. అది నాకు బాగా నచ్చింది. అందుకే దాన్ని ఇక్కడ మిత్రులతో చర్చకోసం ఉంచుతున్నాను. ఇందులోకూడా ఏవైన తప్పుబట్టదగ్గ, లేదా విభేదించదగ్గ విషయాలుంటే చర్చకు సిద్ధం:
ద్వేష,విద్వేషాల మధ్య ఒక సమైక్య రాష్ట్రాన్ని నడపగలమా?విబేధాలు, తగాదాలు, ఆవేశ,కావేశాల మధ్య ఒక రాష్ట్రాన్ని ఇదే విధంగా పాలించగలరా? ప్రతిదానికి అనుమానాలు, పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సహ జీవనం సాగించగలరా? సమైక్య రాష్ట్రం కొనసాగడానికి ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు ఏ మాత్రం అనువుగా లేవని అందరికి తెలిసినా ఎందుకో మొండి పట్టుదల, పంతాలు, పట్టింపులతో తెలుగు సమాజం మొత్తం దేశ ప్రజల ముందు నవ్వుల పాలవుతోంది. అయినా ఈ నేతలకు ఏ మాత్రం జ్ఞానోదయం కలగడం లేదు. సమైక్య రాష్ట్రవాద నేతలే కాదు. ప్రత్యేక రాష్ట్ర వాద నేతలదీ ఇదే పరిస్థితి మొత్తం తెలంగాణ సమాజం అంతా తీవ్రంగా నష్టపోతున్నా,తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం సమస్యలన్నీ హాంఫట్ అవుతాయన్నంత సినిమా చూపుతూ ప్రజలను భ్రమలలో ఉంచుతున్నారు. ఏభై లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని, ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ద్వేష, విద్వేషాలతో సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం ఎంత నష్టమో, అలాగే అసత్యాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే ప్రమాదం. నిజమే. ఇలాంటి వాదనలు అటు సమైక్యవాదులకు రుచించవు. ఇటు ప్రత్యేక వాదులకు రుచించవు, యదార్ధవాది లోక విరోధి అన్నారు. ఇప్పుడు ఎవరైనా నిజాలు చెబితే ఇబ్బందే. అయినా కొన్ని నిజాలు కొందరికైనా తెలియాల్సిందే.
ముందుగా సమైక్య వాద నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. రెండువేల నాలుగులోకాని, రెండు వేల తొమ్మిదిలోకాని తెలంగాణ నేతలంతా ఆయా పార్టీలవారంతా తెలంగాణ రాబోతోందని, తెలంగాణ జెండాలపై పార్టీ ముద్రలు వేసుకుని తిరిగినప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరూ అభ్యంతర పెట్టలేదు. సరికదా! ఎంత చక్కా అధికారంకోసం తెలంగాణ పేరు చెప్పి ఓట్లు తెచ్చుకుంటున్నామని సంతోషించారు.కాంగ్రెస్ నేతలుగా ఉన్న ఎమ్.పిలు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టిజివెంకటేష్, జెసి దివాకరరెడ్డి.. తెలుగుదేశం నేతలు ఎర్రన్నాయుడు, మైసూరారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు ఇలా వీరిలో ఎవరన్నా ఆ రోజులలో అభ్యంతరం చెప్పారా? పైగా తెలుగుదేశంలో అయితే అభిప్రాయ సేకరణ జరిపామంటూ ఒక తంతు నిర్వహించి తెలంగాణ ఇచ్చేసుకోండని తీర్మానం చేసిన కమిటీలో ఎర్రన్నాయుడు, యనమల వంటి వారు ఉన్నారు. వారి నాయకుడు చంద్రబాబు అయితే మీరు తీర్మానం పెడితే మేము మద్దతిస్తామంటూ జోరుగా మాట్లాడేవారు. తీరా కేంద్రం ప్రకటన చేశాక ఈ సీమాంద్ర నేతలంతా ఒక్కసారే రివర్సయ్యారు. ఇదంతా సీమాంధ్ర నేతల స్వయంకృతాపరాదం అని చెప్పకతప్పదు.తీరా రాష్ట్ర ప్రకటన వచ్చాక ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య శాసనసభలో ఎందుకు తీర్మానం పెట్టలేదు?తీర్మానం ఆమోదించడమో, తిరస్కరించడమో చేసి ఉంటే ఈ సమస్య అంతా కేంద్రానికి బదిలీ అయి ఉండేది. ఆమోదించి ఉంటే గొడవే లేదు. తిరస్కరించి ఉంటే అప్పుడు కేంద్రం ఎలా స్పందించి ఉండేదో. లేదా తెలంగాణ ఉద్యమ నేతలు ఎలా వ్యవహరించి ఉండేవారో.కాని అలా కాకుండా మొత్తం గందరగోళంలోకి నెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి జరుగుతున్న కష్టనష్టాలకు కాంగ్రెస్ పార్టీనే బాద్యత వహించాల్సి ఉంటుంది.రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన పాపం వారిదే అవుతుంది. మంచో, చెడో కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నందున దానికి కట్టుబడి తదుపరి చర్యలు చేపట్టి సీమాంద్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఉంటే ఉబయ ప్రాంతాలకు ఇంత నష్టం జరిగి ఉండేది కాదేమో. కొద్ది రోజులు సీమాంద్రలో అలజడి ఉన్నా, హైదరాబాద్ కు సంబంధించి, అలాగే నదీ జలాలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి కేంద్రం తన ప్రతిపాదనకు కట్టుబడి ఉంటే పరిస్థితి మారేదేమో. ఆ పని చేయకుండా రెండు ప్రాంతాలలో ఉద్యమాలు చెలరేగేలా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తెలివితక్కువగా వ్యవహరించింది. దీంతో మొత్తం రాష్ట్రం అంతటా ద్వేష,విద్వేషాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఒకరిని చూస్తే మరొకరికి అనుమానం, వీరు ఏ ప్రాంతం వారో తెలుసుకుని మాట్లాడవలసిన దౌర్బాగ్య పరిస్థితి. తప్పును తప్పుగా, ఒప్పుగా మాట్లాడలేని దైన్య స్థితి. సీమాంధ్ర నేతలను తెలంగాణ నేతలు, తెలంగాణ నేతలను సీమాంధ్ర నేతలు నిందించుకునే వైనం ఇవన్ని చూస్తే రాజకీయాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి ఏర్పడింది.ఇంత జరిగినా సీమాంధ్ర నేతలు ఎందుకు సమైక్య రాష్ట్రం కోరుతున్నారో అర్ధం కాదు. నిజానికి కోస్తా కాని, రాయలసీమ కాని అనేక రంగాలలో వెనుకబడి ఉన్నాయి. లక్షల సంఖ్యలో ప్రజలు వలసలు వెళ్లారంటేనే అక్కడ ఉపాధి అవకాశాలు ఏ రకంగా దెబ్బతిన్నాయో అర్దం చేసుకోవచ్చు. అక్కడ అబివృద్దిపై ఈ నేతలెవ్వరూ దృష్టి పెట్టడం లేదు. పైగా దిక్కుమాలిన రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.వచ్చే పరిశ్రమలు రానివ్వకుండా తగాదాలు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలతో నిత్యం ఘర్షణ పడుతూ మొత్తం రాజకీయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఏదో విదంగా తెలంగాణ నేతలతో అవగాహన కుదుర్చుకుని ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనపోతే సీమాంద్ర నేతలు ఆ ప్రాంతానికి తీరని ద్రోహం చేసినవారవుతారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండు చేస్తున్న నేతల గురించి చూద్దాం. కారణం ఏదైనా తెలంగాణ రాష్ట్రసమితిని ఏర్పాటు చేసి పదేళ్లుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతూ, అన్ని రాజకీయ పార్టీలను తనదారిలోకి తెచ్చుకున్న ఘనత ఆ పార్టీ అదినేత కెసిఆర్ దే. అంతేకాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కొందరు ఎమ్.పిలను తన మద్దతుదారుల్లా ఉండేలా చేసుకున్న ఘనత కూడా కెసిఆర్ దే. కాంగ్రెస్ నేతలను ఎంతగా లొంగ తీసుకున్నారంటే, కెసిఆర్ ను ఏ సీమాంద్ర నేత విమర్శించినా, వారిని టిఆర్ఎస్ నేతలకన్నా ముందుగా అంతకన్నా తీవ్రంగా విమర్శించేలా చేయగలిగారు. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నా టిఆర్ఎస్ కు , తెలంగాణ జెఎసికే ఎక్కువ విదేయతగా ఉండేలా చేసుకోవడం వరకు సఫలీకృతం అయ్యారు.కాంగ్రెస్ నేతలను తీవ్రంగా కెసిఆర్ దూషించినా ఫర్వాలేదులే అన్నంతగా చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇంతగా అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ నేతలను పూర్తిగా నమ్మడానికి లేదని అంతా అంటారు. ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ నేతలను తనదారిలోకి తెచ్చుకున్నట్లు డిల్లీలోని కాంగ్రెస్ నేతలను ఇంకా తన మార్గంలోకి తెచ్చుకోవడంలో కెసిఆర్ సఫలం కాలేకపోయారు. అలాగే కెసిఆర్ అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడుతున్న మాట నిజమేకాని, తమ పదవుల వరకు వచ్చేసరికి, పార్టీ వరకు వచ్చేసరికి పూర్తిగా వదులుకోలేకపోతున్నారు. వారందరిమీద ఒత్తిడి తేవడానికే తెలంగాణ జెఎసి నేతృత్వంలో సకల జనుల సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. సకల జనులంటే అన్ని వర్గాల ప్రజలు ఏరకంగా సమ్మె చేస్తారా అన్న అబిప్రాయం ఉండేది. కాని తీరా చూస్తే ఆర్గనైజ్ డ్ సెక్టార్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసి ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, ఇలా ప్రభుత్వంలోని వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులందరిని సమ్మెలోకి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. కాని ప్రజలకు దీనివల్ల చాలా అసౌకర్యం కలుగుతున్న మాట నిజమే. అంత మాత్రాన మొత్తం సమ్మెకు అనుకూలమని ఉద్యమ నాయకత్వం భావిస్తే మాత్రం అది తప్పని చెప్పకతప్పదు. నిజమే. తెలంగాణ ఆకాంక్ష సర్వత్రా ఉండవచ్చు. అందులో భిన్నాభిప్రాయం లేదు. కాని సమ్మెకు కూడా అంతా అనుకూలమేనని అనుకోవడానికి వీలులేని పరిస్థితి కనబడడం లేదు. సమ్మెకు ఇష్టపడి కొందరు సమ్మె చేస్తుండవచ్చు. కాని అనేకమంది భయపడి చేస్తున్నారు.ఉద్యమ కారులు చేసే బెదిరింపులకు లొంగి చేస్తున్నారన్నది వాస్తవం. తెలంగాణ నేతలు చర్యల వల్ల తెలంగాణ రైతులతోపాటు అన్ని ప్రాంతాల రైతులు ముఖ్యంగా విద్యుత్ పై ఆధారపడే వారు బాగా నష్టపోతున్నారు.విద్యార్దులు మాత్రం తెలంగాణలోని వారే నష్టానికి గురి అవుతున్నారు.రవాణా సమ్మె వల్ల తెలంగాణలోని పేద,దళిత ,బలహీనవర్గాలవారికి ఎంత కష్టం వస్తున్నదో చెప్పజాలం. ప్రపంచం అంతా ఒక గ్రామం మాదిరి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న ఈ తరుణంలో రాష్ట్రంతో సకల సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేయడం ద్వారా కొంతకాలం ప్రజలను నమ్మించవచ్చు.ఎల్లకాలం అది సాద్యపడదు. నినాదాలు వినడానికి బాగానే ఉంటాయి. కాని ఆచరణ వచ్చేసరికే అందులోని సమస్యలు తెలుస్తాయి. తెలంగాణ వస్తే ఏభై లక్షల ఎకరాలకు నీరు వస్తుందని చెబుతుంటారు. అలాగే ఐదు లక్షల ఉద్యోగాలు వస్తుంటాయి. ఇవన్ని అసత్యాలు, ఆచరణసాధ్యం కాని విషయాలే ప్రచారం చేశారు.ఇప్పుడు ఆవేశంలో జనం వీటిని నమ్మినా కొన్నాళ్ల తర్వాతైనా అసలు వాస్తవం తెలుసుకోలేకపోరు. అప్పుడు వచ్చే భవిష్యత్తు సంగతేమో కాని, ఇప్పుడు మాత్రం లక్షల ఎకరాలు ఎండిపోతుంటే, లక్షలాదిమంది విద్యార్ధులు చదువులు లేక వారి భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటే ఉద్యమ నేతలు మానవత్వంతో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పకతప్పదు. వచ్చే ఉద్యోగాల సంగతేమోకాని, ఇప్పుడు బంద్ ల కారణంగా పోయే ఉద్యోగాల సంగతి, కాలే కడుపుల గురించి కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం అన్నది ఒక ఆకాంక్ష. దానికి ప్రజాస్వామ్య లక్షణం తేగలిగారు. అత్యధిక ప్రజలు కోరుకుంటున్న సంగతిని రుజువు చేయగలిగారు.అంతవరకు బాగానే ఉంది. ఏ ప్రజలైతే తెలంగాణాను కోరుకుంటున్నారో వారినే అవస్థల పాలు చేయడం మాత్రం వ్యూహ రీత్యా కొంతకాలం వరకు బాగానే ఉన్నట్లు కనిపించినా, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయోజనం చేకూరదు. ఒక్కసారి ప్రజలు ఎదురు తిరగడం మొదలైతే అప్పుడు ఉద్యమం మొత్తంగా దెబ్బతింటుంది. గతంలో ఇలాంటి అనుభవాలు టిఆర్ఎస్ నేతలకు ఎదురైన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కనుక తెలివిమంతుడుగా పేరొందిన కెసిఆర్ మరింత తెలివిగా తన వ్యూహాలను మార్చుకుని ప్రజలందరి అభిమానాన్ని చూరగొనగలిగితేనే ఆయన ఉద్యమానికి సార్ధకత వస్తుంది.లేకుంటే నిజంగానే ఆయన చెబుతున్నట్లు తెలంగాణ వచ్చినా ప్రజలకు ఆయనపై అభిమానం పెరగకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సీమాంద్రులపై ఎన్ని నెపాలు మోపినా ప్రయోజనం ఉండదు.ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంద్ర నేతలు ఆహ్వానించి ద్వేష,విద్వేషాలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలి. అలాగే తెలంగాణ ఉద్యమ నేతలు ప్రజలకు ఉద్యమాలంటే విరక్తి కలిగేలా కాకుండా జాగ్రత్తపడాలి.ఎందుకంటే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఈ డ్రామాను ఎంతకాలం నడుపుతుందో అర్దం కాకుండా ఉంది . అందువల్ల తెలుగు జాతి కలిసి ఉన్నా, విడిపోయినా ఈ లోగా పరస్పర ద్వేషాలతో రగిలిపోకూడదనే విజ్ఞులైన వారంతా కోరుకోవాలి.
(Courtesy: Sri Kommineni Srinivasa Rao garu)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment