గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Thursday, April 3, 2025
విధ్వంసకాండపై మౌనమా? …బుద్దామురళి
https://docs.google.com/document/d/1h9PRwdHzqB7l_bBdO0e2p4L_Xk8rcLIrwZfJaXuCqVk/edit?usp=sharing
నమస్తే తెలంగాణ ఏప్రిల్ మూడు 2025
విధ్వంసకాండపై మౌనమా? …బుద్దామురళి
రాజధాని నగర శివారుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విల్లాలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు పచ్చని పొలాలతో అలరారిన గ్రామాలు. పచ్చదనం అలానే ఉంది కానీ, అవి పేదలు, రైతులు నివసిస్తున్న గ్రామాలు కాదు. సంపన్నులు, ఎగువ, మధ్య తరగతి వాళ్లు హైదరాబాద్ మహా నగరంలోని కాలుష్యంలో నివసించలేక నగరానికి దూరంగా విల్లాల్లో నివసిస్తున్నారు. అది మంచి గాలి కోసం కావొచ్చు. నగరంలో నివసించలేని పరిస్థితులు ఉండటమూ కావొచ్చు. ఒకప్పుడు బతుకుదెరువు లేక గ్రామాలను వీడి నగరానికి వచ్చేవారు. ఇప్పుడు నగరంలో కాలుష్య గాలిని పీల్చలేక నగరాన్ని వీడి గ్రామాలకు వెళ్తున్నారు.
హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు చల్లగా అద్భుతంగా ఉండేది. జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తుంటే నిద్రపోయినవారు కూడా
చల్లని గాలి సోకగానే హైదరాబాద్ శివారులకు వచ్చా మనుకునేవారు. సికింద్రాబాద్ కింగ్స్ దారిలో బాల్యం గడిచింది. రోడ్డుకిరువైపులా చెట్లు చల్లని గాలి అనుభూతి ఇప్పటికీ గుర్తుంది. క్రమంగా హైదరాబాద్ కాంక్రీట్ జనారణ్యంగా మారింది. నగరం అన్నాక అభివృద్ధి చెందుతుంది. కానీ, గాలి కూడా దొరకకుండా చేయడం అభివృద్ధి కాదు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా సచివాలయంలో ఉద్యోగులు సభ నిర్వహిస్తారు. సీఎంకు స్వాగతం పలుకుతారు. ఉద్యమంద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ కావడంతో ఆ రోజు అక్కడి వాతావరణం చాలా ఉత్సాహంగాఉంది. ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడానికి కేసీఆర్ సిద్ధమైన అక్కడ ఎండ, ఉక్కపోత వల్ల ఎక్కువసేపు మాట్లాడలేదు. ఇది హైదరాబాద్ వాతావరణంకాదు. ఎంత చల్లగా ఉండేది అంటూ వాతావరణం గురించి చెప్పుకొచ్చారు. బహుశా అప్పుడే హరితహారం గురించి ఆలోచన చేసి ఉంటారు. ఆ తర్వాత తెలంగాణలో ఒక ఉద్యమంలా హరితహారం చేపట్టారు. ఏ రాశి వారు ఏ మొక్కలు నాటితే బాగుంటుందో కేసీఆర్ సూచిస్తే మేధావులు, మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇదేం మూఢనమ్మకం అని. పలానా రాశివారు పలానా మొక్కలు మాత్రమే నాటాలనేది చట్టం కాదు. వేరే మొక్క నాటితే శిక్షలు వేయడం కాదు. హరితహారం వంటి మీడియాకు ఆసక్తి ఉండని అంశంపై కూడా ఆసక్తి కలిగించి. ఏదోరకంగా ప్రచారం లభించి పెద్ద ఎత్తున ప్రజలు
మొక్కలు నాటాలనేది కేసీఆర్ ఉద్దేశం. కానీ మేధావులకు, మీడియాకు ఇందులో ప్రయోజనం కన్నామూఢ నమ్మకమే ఎక్కువ కనిపించింది.
మీ రాశుల ప్రకారం మొక్కలు నాటండి.అంటే అలా ఎలా అంటారని తమ మీడియాలో చర్చలు నిర్వహించినవారికి, మేధావులకు ఇప్పుడు హెచ్ సీ యూలోని నాలుగువందల ఎకరాల్లో వేలాది చెట్లను వందలాది బుల్డోజర్లతో కూలుస్తుంటే కనిపించడం లేదు.
నెమళ్ల ఏడుపులు వినిపించడం లేదు. సీఎంకు అక్కడ గుంటనక్కలు కనిపించాయి. విద్యార్థులు ఔను మేం గుంటనక్కలమే అని భారీ ప్రదర్శన నిర్వహించారు. పోరాట స్ఫూర్తి చనిపోలేదని విద్యార్థులు నిరూపిస్తున్నారు.
విద్యార్థుల ఉద్యమాన్ని బిజినెస్ స్టాండర్డ్ వంటి జాతీయ మీడియా పట్టించుకున్నా.. స్థానిక మీడియా అంతగా చొరవ చూపడం లేదు. రికార్డ్ కోసం ఉద్యమాన్ని కవర్ చేయడం వేరు. జరుగుతున్నది
అన్యాయమని భావిస్తే ఉద్యమానికి అనుకూలంగా చొరవ చూపడం వేరు. సామాజిక మాధ్యమాల పుణ్యమాని విద్యార్థుల వాయిస్ వినిపిస్తున్నది. లేకపోతే సంప్రదాయ మీడియానే ఉండి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించవచ్చు. ఏపీలో ఏవో కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తే, ఉద్యమాన్ని మీడియా తన భుజాన మోసింది. 200 దేశాల్లో బాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని అదరగొట్టింది. కానీ, హైదరాబాద్లో జరుగుతున్న విధ్యంసంపై మాత్రం
మీడియా సమాచారాన్ని రికార్డ్ చేయడం వరకే పరిమితమవుతుంది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చి
రోడ్డునపడేసినా, సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్లు, జింకలను చెల్లాచెదురు చేసి, వేలాది చెట్లను కూల్చి, నాలుగు వందల ఎకరాలను ఎవరికో ధారాదత్తం చేయాలని చూస్తున్నా... మీడియా స్పందన అంతంత మాత్రమే.రికార్డ్ కోసం వార్త రాయడం వేరుగా ఉంటుంది. అన్యాయాన్ని అన్యాయం అని ప్రశ్నించడం వేరుగా ఉంటుంది. మీడియా ఇప్పుడు రికార్డ్ మాత్రమే చేస్తున్నది. యూనివర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో పని కానిస్తున్నారు. బుల్డోజర్ల విధ్వంసంతో నెమళ్లు, జింకలు పరిగెత్తుతూ చేస్తున్న ఆర్తనాదాల వీడియో వింటే మనసు చలిస్తుంది. వాటి ఏడుపునకు శక్తి ఉంటే బాగుండు, వాటి ఉసురు తగిలితే బాగుండనిపించింది. ఆ వీడియోలు, అడవి జంతువుల హాహాకారాలు మీడియా చిత్రీకరించలేదు. అక్కడి విద్యార్థులు రహస్యంగా తమ కెమెరాల్లో బంధించడంతో సామాజిక మాధ్యమాలద్వారా బయటకు వచ్చాయి. అంతే కానీ మీడియాద్వారా కాదు. అనేక కారణాల వల్ల రేవంత్రెడ్డి ప్రభుత్వానికి మీడియాల యాజమాన్యం పూర్తి మద్దతు లభిస్తున్నది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారివి. అయితే, 'మేం రాయకపోతే, మేం చూపకపోతే ప్రజలకు తెలియదనుకునే రోజులుకావు. సామాజిక మాధ్యమాల కాలం ఇది. ప్రధాన మీడియాను మించి సామాజిక మాధ్యమాల వల్ల క్షణాల్లో ప్రజలకు సమాచారం అందుతున్న రోజులివి. ప్రజల కోసం కాకపోయినా, తమ ఉనికి తాము కాపాడుకోవడానికి, విశ్వసనీయత నిలుపుకోవడానికైనా ఇలాంటి విధ్వంసాలపై మీడియా అనివార్యంగా స్పందించాల్సిన సమయం.
ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం మనకెందుకు అనుకుంటే రేపు ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ భూములపై కన్ను వేయవచ్చు, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ భూములపైకన్ను వేయవచ్చు. నాదెండ్ల భాస్కరరావు నెలరోజులు సీఎంగా ఉన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ స్థలాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెల రోజులకే దిగిపోవడం వల్ల పార్క్బతికి బట్ట కట్టింది. నెల రోజులు కాదు, ఇప్పుడు కాంగ్రెస్కు ఇంకా మూడున్నరేండ్ల గడువున్నది. మౌనంగా ఉంటే అన్నీఅమ్ముకోవడానికి అవసరమైనంత సమయం ఉన్నది. ప్రభుత్వం తాము చేస్తున్నది చట్టబద్ధం అనుకున్నప్పుడు దొంగచాటుగా, అర్ధరాత్రి, సెలవు రోజుల్లో ఎందుకుచేయాలి. కోర్టులు పనిచేస్తున్నప్పుడే బుల్డోజర్లు పంపవచ్చు కదా?
Subscribe to:
Posts (Atom)